IT Department: ఐటీ శాఖకు సోషల్‌ మీడియా అకౌంట్ల యాక్సెస్?

by S Gopi |

ఆదాయపు పన్ను శాఖ ప్రజల సోషల్ మీడియా అకౌంట్ల యాక్సెస్ అడుగుతుందనే ప్రచారం జోరుగా సాగింది.

IT Department: ఐటీ శాఖకు సోషల్‌ మీడియా అకౌంట్ల యాక్సెస్?
X

దిశ, బిజినెస్ బ్యూరో: మన దేశ ఆదాయపు పన్ను వ్యవస్థ ఆధారంగా నిర్దిష్ట ఆదాయ పరిమితి దాటితే టాక్స్ శ్లాబులను బట్టి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్ను నిబంధనలకు సంబంధించి ఐటీ శాఖ ఎప్పటికప్పుడు సవరిస్తుంది. ఇటీవల కూడా మరింత సరళంగా మార్చింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు సులభం కానుంది. అయితే, కొందరు పన్ను చెల్లింపుదారులు పన్ను ఎగవేసేందుకు అడ్డదారులు తొక్కుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. తమ ఆదాయ వనరుల్ని ఐటీ శాఖకు తెలియకుండా ఉండేందుకు తప్పుడు క్లెయిమ్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వస్తుందని, పన్ను ఎగవేతను అరికట్టడానికి ఆదాయపు పన్ను శాఖ ప్రజల సోషల్ మీడియా అకౌంట్ల యాక్సెస్ అడుగుతుందనే ప్రచారం జోరుగా సాగింది.

2026, ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వస్తుంది. దీని ద్వారా పన్ను ఎగవేతల్ని కట్టడి చేయడానికి, ఆదాయపు పన్ను శాఖకు సోషల్ మీడియా అకౌంట్లు (వాట్సాప్, ఫేస్‌బుక్ లాంటివి), పర్సనల్ ఈ-మెయిల్స్‌ను సమీక్షించే పూర్తి అధికారం ఉంటుంది.. అంటూ ఓ ఎక్స్ పోస్ట్ వైరల్ అయింది. దీనిపై చాలామంది ఆందోళనకు గురయ్యారు. ఇందులో ఎంతవరకు నిజం ఉంది, దీనిపై ఐటీ శాఖ ఏమని స్పందించిందనే విషయం తెలుసుకుందాం. ఆదాయపు పన్ను శాఖకు నిజంగా అలాంటి అధికారాలు ఉంటాయా అని తెలుసుకోవాలనే ఆసక్తి చాలామంది పన్ను చెల్లింపుదారులలో రేకెత్తించింది.

ఈ అంశంపై స్పందించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ బృందం ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. అటువంటి అధికారాలను ఐటీ శాఖ ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పిందంటూ వివరణ కూడా ఇచ్చింది.

ఐటీ శాఖ వ్యక్తిగత డిజిటల్ వివరాలను యాక్సెస్ చేయవచ్చా?

పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందం సదరు పోస్ట్ చేసిన ట్వీట్ తప్పుదోవ పట్టించేదని, ఆదాయపు పన్ను శాఖకు అలాంటి అధికారం ఏదీ లేదని పేర్కొంది. ఆదాయపు పన్ను చట్టం, 2025లోని సెక్షన్ 247లోని నిబంధనల ప్రకారం, కేవలం సోదాలు, దాడుల సమయంలో సోషల్ మీడియా అకౌంట్లను, ఈ-మెయిల్స్ మాత్రమే తనిఖీ చేసే అధికారం ఉంటుంది. పైగా, తీవ్రమైన పన్ను ఎగవేత ఆరోపణల గురించి ఖచ్చితమైన ఆధారాలు ఉన్నప్పుడే ఈ తరహా తనిఖీలు చేపట్టాల్సి ఉంటుంది. సోదాలు, తనిఖీలు చేసే సమయంలో డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవాలనే నిబంధన 1961 నాటి చట్టంలోనే ఉంది. ఇప్పుడు మారిన పరిస్థితుల మధ్య డిజిటల్ రికార్డులను కూడా చట్టంలో చేర్చారు. ఇది కూడా పన్ను వేతలను, బ్లాక్ మనీని నియంత్రించేందుకే గానీ, సాధారణ పౌరుల సోషల్ మీడియా అకౌంట్లను చెక్ చేయడం దీని ఉద్దేశ్యం కాదని కేంద్రం వెల్లడించింది.

ప్రభుత్వం స్పష్టత

సాధారణ వెరిఫికేషన్ లేదా స్క్రూటినీ కోసం ఈ అధికారాన్ని ఉపయోగించలేరని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తేలినప్పుడే సోదాల సమయంలో కఠిన నిబంధనలను అనుసరించడం జరుగుతుంది. అటువంటి సమయంలోనే పన్ను చెల్లింపుదారుల డిజిటల్ రికార్డులను సేకరిస్తారు. చట్టాన్ని అనుసరించే, సకాలంలో పన్ను కట్టే ఆదాయపు పన్ను చెల్లింపుదారుల డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేయడానికి ఐటీ అధికారులకు అనుమతి ఉండదు. అటువంటి ప్రచారంపై ఆందోళన అవసరంలేదని, పన్ను చట్టాలకు సంబంధించి తప్పుడు/నకిలీ సమాచారాన్ని నమ్మవద్దని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.

Next Story