- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Income Tax: 622 పేజీలతో, 536 సెక్షన్‌లతో కొత్త ఐటీ బిల్లు
సరళమైన పదజాలం, పన్ను నిబంధనలను ఇందులో ప్రవేశపెట్టింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం ఉన్న పాత ఐటీ చట్టం స్థానంలో కొత్త బిల్లును తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. పన్ను చెల్లింపుదారులకు పాత దాని కంటే సులభంగా అర్థమయ్యేలా, సరళమైన భాషలో కొత్త ఆదాయపు పన్ను చట్టం ఉంటుందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇప్పుడున్న చట్టం 1961 నాటిది. ఇటీవల కొత్త బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపగా, గురువారం(ఫిబ్రవరి 13న) పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం స్థాయి సంఘానికి పంపించి, మార్పులు అవసరమనుకుంటే చేసిన అనంతరం కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురానున్నారు. సరళమైన పదజాలం, పన్ను నిబంధనలను ఇందులో ప్రవేశపెట్టింది. అన్ని అనుమతులకు ఆమోదం లభిస్తే కొత్త చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానుంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025లో మొత్తం 536 సెక్షన్లు ఉన్నాయి. పాత చట్టంలో 298 సెక్షన్లు మాత్రమే ఉండేవి. పాత దాంట్లో 14 షెడ్యూల్లు ఉండగా, తాజా బిల్లులో 16కి పెంచారు. ఇక, 23 అధ్యయాలను మునుపటి తరహాలోనే కొనసాగించారు. మొత్తంగా ఆదాయపు పన్ను చట్టం పేజీల సంఖ్యను మాత్రం 880 పేజీల నుంచి 622కి కుదించారు.
కొత్త ఐటీ చట్టంలో గతంలో ఉన్న 'అసెస్‌మెంట్ ఇయర్ ' స్థానంలో కొత్తగా 'ట్యాక్స్ ఇయర్ ' అనే విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడున్న చట్టం ప్రకారం, అసెస్‌మెంట్ ఇయర్, ప్రివ్యూస్ ఇయర్ లాంటి పదాల వల్ల చాలామందికి గందరగోళంగా అనిపిస్తుంది. దీన్ని సవరించి కొత్త బిల్లులో అన్ని వర్గాల వారికి సులభంగా అర్థమయ్యేదుకు ట్యాక్స్ ఇయర్‌ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
ట్యాక్స్ ఆడిట్ ఫైలింగ్ తేదీని సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 31కి మార్చారు. ఫైలింగ్ ఆఖరు తేదీని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30కి పొడిగించారు. లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ ట్యాక్స్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
పాత ఆదాయపు పన్ను చట్టంలో వ్యవస్థీకృత అంశాలు, ఇతర నిబంధనల ఫ్రేమ్‌వర్క్ కోసం సవరణలకు వెళ్లాల్సి వస్తోంది. అయితే, కొత్త బిల్లులో దీనికి బదులుగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ)కి స్వతంత్ర అధికారాలు కల్పించింది. డిజిటల్ పన్ను పర్యవేక్షణ వ్యవస్థ, పన్ను నిర్వహణ నిబంధనలను సీబీడీటీనే రూపొందించేలా ప్రతిపాదించారు.






