- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగారం రేట్ ఎంత ఇక పెరిగినా నో ప్రాబ్లమ్.. అతి తక్కువ ధరలకే ఆభరణాలు అందించేలా కేంద్ర ప్రభుత్వం ప్లాన్
సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఏ మాత్రం అందనంత ఎత్తుకు పసిడి ధరలు పెరిగిపోయాయి.

దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ఇప్పుడు అత్యంత విలాసవంతమైన వస్తువుల జాబితాలో చేరింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఏ మాత్రం అందనంత ఎత్తుకు పసిడి ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం సంపన్న వర్గాలకు మాత్రమే అన్నట్టు రోజురోజుకు గోల్డ్ రేట్స్ పరుగులు తీస్తున్నాయి. మరి మధ్య తరగతి ప్రజలు బంగారు ఆభరణాలకు దూరం కావాల్సిందేనా..? ఇక వాళ్ల మెడల్లో నగలు కనుమరుగు కానున్నాయా..? అంటే కాదనే సమాధానం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. బంగారం ధర ఎంత పెరిగినా సామాన్యులు కూడా ఆభరణాలు కొనుగోలు చేసేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక 24, 22 క్యారెట్ల బంగారాన్ని పక్కన పెట్టేసి ఏం చక్కా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన గోల్డ్‌ని కొనుగోలు చేస్తే ఇటు డబ్బులు ఆదా కావడంతోపాటు అటు బంగారు ఆభరణాలు ధరించిన ముచ్చటా తీరుతుంది. ఇంతకూ ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త నిర్ణయం ఏంటో చూద్దాం.
హాల్ మార్క్‌తో 9K ఆభరణాలు
ఇన్వెస్టర్లకు 24 క్యారెట్ల బంగారం చాలా ఉపయోగపడుతుంది. వాళ్లు తమ పెట్టుబడులు మొత్తం దీనిపైనే పెడతారు. ఇక నగల తయారీకి 22 క్యారెట్ల బంగారాన్ని వినియోగిస్తుంటారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఇంది ఈ రెండింటికే. కానీ బంగారంలో 18, 14, 9 క్యారెట్ల బంగారం కూడా ఉంటుంది. వీటితోనూ ఆభరణాలు తయారీ చేస్తారు. కాకపోతే ఈ మూడు రకాల క్యారెట్ల జ్యువెలరీల్లో ఇతర లోహాలు అధికంగా కలుస్తాయి. కాబట్టి వీటికి 22 క్యారెట్ల బంగారంతో పోల్చితే ధర తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం బంగారం ధర లక్షా 20 వేలకు పైకి ఎగబాకిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 9 క్యారెట్ల బంగార ఆభరణాలను ప్రోత్సహించేందుకు నడుం బిగించింది.
సామాన్యులకు బంగారాన్ని చేరువ చేసేలా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)కి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇకపై 9 క్యారెట్ల బంగారు ఆభరణాలపై కూడా హాల్ మార్క్ వేయాలని ఆదేశాలు జారీ చేసింది. బంగారం క్వాలిటీ, స్వచ్ఛతను, గ్యారెంటీని హాల్‌మార్కింగ్ తెలియజేస్తుంది. BIS నిబంధనల ప్రకారం బంగారు ఆభరణాలపై హాల్ మార్క్ వేస్తారు. ఈ హాల్‌మార్కింగ్ ప్రకారం బంగారం ఎంత స్వచ్ఛమైనదో తెలియజేస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ తాజా ప్రకటన ప్రకారం హాల్‌మార్కింగ్‌లో ఇప్పుడు 24KF, 24KS, 23K, 22K, 20K, 18K, 14K, 9K గ్రేడ్‌లు ఉన్నాయి. ఇప్పటి వరకు 9K జ్యువెలరీపై BIS హాల్ మార్క్ లేకపోవడంతో వ్యాపారులు మోసాలకు పాల్పడేవారు. ఇకపై హాల్ మార్క్‌తో ఆ మోసాలకు చెక్ పెట్టినట్టయింది.
9 క్యారెట్ల బంగారం అంటే ఏమిటి?
9 క్యారెట్ల బంగారం ఆభరణాల తయారీకి వినియోగిస్తారు. దీనిలో 37.5 శాతం స్వచ్ఛతతో బంగారం ఉంటుంది. మిగిలిన మిశ్రమంలో ఇతర లోహాలు కలుస్తాయి. ఉదాహారణకు 24 క్యారెట్ల బంగారంతో ఆభరణం తయారీ చేయాలంటే దాంట్లో 22 క్యారెట్లు బంగారం, మరో 2 క్యారెట్లు వెండి, రాగి, ఇతర మిశ్రమాలు కలుస్తాయి. అలాగే 9 క్యారెట్ల బంగారంలో 37.5శాతం బంగారం, 42.5శాతం వెండి, 20 శాతం రాగి మిశ్రమం కలుస్తుంది. 9 క్యారెట్ల గులాబీ బంగారంలో ఎక్కువ రాగి కంటెంట్ ఉంటుంది. ఇది ఆభరణానికి మరింత ఎరుపు రంగును ఇస్తుంది. అలాగే ఇతర లోహాలు కలిపినందున 9 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైన బంగారం కంటే గట్టిగా ఉంటుంది. ఇది ఆభరణాలకు ప్రసిద్ధ ఎంపికగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
9 క్యారెట్ల బంగారం విలువ ఎంత?
బంగారం అధికారిక స్పాట్ ధర 24 క్యారెట్లు ఉంటుంది. ఇది స్వచ్ఛమైన బులియన్ బంగారం విలువను సూచిస్తుంది. ఇదే 9 క్యారెట్ల బంగారంలో 37.5 శాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏ సమయంలోనైనా 9 క్యారెట్ల బంగారం విలువను బులియన్ స్పాట్ ధరలో 37.5 శాతంతో తీసుకొనే లెక్కిస్తారు. క్యారెట్ రేటింగ్ విషయానికి వస్తే, క్యారెట్ ఎంత ఎక్కువగా ఉంటే బంగారం అంత ఖరీదైనది. ఎందుకంటే క్యారెట్ రేటింగ్ నేరుగా స్వచ్ఛతకు సంబంధించినది. ఉదాహరణకు 9k బంగారం 9/24 భాగాల స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంలో 99.99శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 22 క్యారెట్లలో 91.60 శాతం, 20 క్యారెట్లలో 83.30 శాతం, 18 క్యారెట్లలో 75 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగతా శాతం ఇతర లోహాలు కలిపి ఆభరణాలు తయారీ చేస్తారు.
అతి తక్కువ ధరలకే ధృడమైన బంగారు ఆభరణాలు
ఇక 9 క్యారెట్ల బంగారంలో 37.5 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మిగిలిన 62.5 శాతం ఇతర లోహాలు ఉంటాయి. ఈ బంగారంలో చేసిన ఆభరణాలు ధృడంగా, నాణ్యతతో ఉంటాయి. ఇవి కేవలం ఫంక్షన్లకే కాదు.. నిత్యం ధరించి ఉండవచ్చు. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం తులం లక్షా 23 వేల రూపాయలు ఉంది. అదే 9 క్యారెట్ల బంగారం కేవలం రూ.40 వేలు మాత్రమే ఉంది. అంటే 10 గ్రాముల చైన్ లేదా ఆభరణం తీసుకుంటే రూ.40 వేలకే వస్తుంది. ఇక రింగ్‌లు, చెవి పోగులు రూ.10, రూ.20 వేలలో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆభరణాలపై కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) హాల్‌మార్క్ వేస్తుంది కాబట్టి మోసాలకు ఆస్కారం ఉండదు. ఏ ఆభరణం కొన్నా BIS మార్క్ ఉందా లేదా అనేది క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రతి ఆభరణం మీద BIS హాల్‌మార్క్, బంగారం ఫ్యూరిటీ నంబర్ 375 (9K), 585 (14K), 750 (18K), 916 (22K), 999 (24K), Assaying Center Code, జువెలర్ మార్క్ అంటే ఆ నగను విక్రయించిన వ్యాపారి గుర్తు, HUID 6 అంకెల కోడ్‌ను తప్పని సరిగా తనిఖీ చేయాలి. ఇవన్నీ ఉంటే ఎలాంటి మోసాలు లేవని, ఆ జ్యువెలరీని నిశ్చితంగా కొనుగోలు చేయవచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
Read More : వడ్డీకి ఇచ్చుకునే బదులు.. వాటిపై పెట్టుబడులు పెడితే డబుల్ ధమాకా!?






