Anil Ambani: అనిల్ అంబానీని చుట్టుముడుతున్న కష్టాలు.. బ్యాంకులకు ఈడీ నోటీసులు

by S Gopi |

ఈ బ్యాంకులు ఆయా కంపెనీలకు భారీ మొత్తంలో రుణాలిచ్చాయి.

Anil Ambani: అనిల్ అంబానీని చుట్టుముడుతున్న కష్టాలు.. బ్యాంకులకు ఈడీ నోటీసులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవలే మనీలాండరింగ్ వ్యవహారంలో దర్యాప్తును ఎదుర్కొంటున్న ఆయనకు, తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన కంపెనీలకు మంజూరు చేసిన రుణాలపై వివరాలు కోరుతూ పలు బ్యాంకులకు లేఖ రాసింది. మొత్తం 12-13 బ్యాంకులకు ఈడీ నోటీసులు పంపినట్టు సంబంధిత వ్యక్తులు తెలిపారని ఎన్డీటీవీ ప్రాఫిట్ కథనం పేర్కొంది. ప్రధానంగా రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్‌లకు మంజూరు చేసిన రుణాలకు సంబంధించిన వివరాలు కోరుతూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు నోటీసులు ఇచ్చింది. వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సహా యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యూకో, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లు ఉన్నాయి. ఈ బ్యాంకులు ఆయా కంపెనీలకు భారీ మొత్తంలో రుణాలిచ్చాయి. వాటిలో మొండి బకాయిలుగా మారిన కేసులకు సంబంధించి కొంతమంది బ్యాంకు అధికారులకు నోటీసులు ఇచ్చినట్టు, వారిని ప్రశ్నించేందుకు పిలిపించే అవకాశమూ ఉందని సమాచారం. రుణాల క్లియరెన్స్ ప్రాసెస్, ఎంతకాలానికి డిఫాల్ట్‌గా నిర్ణయించారు, వాటి ఖాతాల నుంచి రికవరీ చర్యల గురించి వారిని వివరణ ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది.

అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై జరిగిన రూ. 3,000 కోట్ల రుణ మోసం కేసుకు సంబంధించి ఏజెన్సీ గతవారం మొదటి అరెస్టును చేసింది. బిస్వాల్ ట్రేడ్‌లింక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పార్థసారథి బిస్వాల్‌ను శుక్రవారం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎలే)-2002 కింద అరెస్టు చేశారు. అతను రిలయన్స్ పవర్ తరపున నకిలీ హామీ పత్రాలను సమర్పించిన ఆరోపణలున్నాయి. 2017-2019 మధ్య యెస్ బ్యాంక్ రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాలలో సుమారు 3,000 కోట్ల రూపాయలను దారి మళ్లించినట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. రుణాలు మంజూరు చేయడానికి ముందే బ్యాంకు ప్రమోటర్లు కూడా కొంత మొత్తం అందుకున్నారని ఈడీ కనుగొంది. ఈ కేసు విషయంలో గత వారం అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేయడమే కాకుండా, ఇతర దేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చింది.

Next Story