US Tarrif: భారతీయ ఎగుమతులపై అమెరికా పరస్పర సుంకాల ప్రభావం తక్కువే

by S Gopi |

అమెరికా పరస్పర సుంకాల ప్రభావం మన ఎగుమతులపై ఎక్కువ ప్రభావం ఉండదని ఎస్‌బీఐ చెబుతోంది.

US Tarrif: భారతీయ ఎగుమతులపై అమెరికా పరస్పర సుంకాల ప్రభావం తక్కువే
X

దిశ, బిజినెస్ బ్యూరో: వాణిజ్య పరిమితులపై ఆందోళనలు ఉన్నప్పటికీ, భారతీయ ఎగుమతులపై యుఎస్ పరస్పర సుంకాల ప్రభావం తక్కువగా ఉంటుందని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ అంచనా వేసింది. తమ దేశ ఉత్పత్తులపై పన్నులు విధించే దేశాలపై పరస్పర సుంకాలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. భారత్ మిత్ర దేశమైనప్పటికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి దేశీయంగా ఆందోళనలు పెరిగాయి. అయితే, అమెరికా పరస్పర సుంకాల ప్రభావం మన ఎగుమతులపై ఎక్కువ ప్రభావం ఉండదని ఎస్‌బీఐ చెబుతోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం, భారత ఉత్పత్తులపై అమెరికా గరిష్ఠంగా 15-20 శాతం మేర సుంకం పెంచినప్పటికీ మన ఎగుమతులపై 3-3.5 శాతం ప్రభావం మాత్రమే ఉంటుంది. ఈ భారాన్ని కూడా మరిన్ని ఎగుమతులను పెంచడం ద్వారా తగ్గించుకోవచ్చు. దీంతో పాటు వ్యూహాత్మకంగా ఎగుమతుల్లో వైవిధ్యాన్ని పెంచడం, కొత్త వాణిజ్య మార్గాలను అనుసరించడం ద్వారా అమెరికా విధించే పరస్పర సుంకాల ఒత్తిడిని తగ్గించవచ్చని ఎస్‌బీఐ నివేదిక వివరించింది. దీనికోసం యూరప్, మిడిల్ ఈస్ట్ సహా ఇతర దేశాలకు సరఫరా సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని, తద్వారా ఎగుమతుల్లో స్థిరమైన వృద్ధిని కొనసాగించవచ్చని నివేదిక సూచించింది.

గణాంకాల ప్రకారం, మన దేశ ఎగుమతులపై అమెరికా విధించే సుంకాలు సగటున 3.3 శాతం ఉండగా, అమెరికా ఎగుమతులపై మనం విధించే సుంకాల సగటు 17 శాతం ఉంది. మరోవైపు, అమెరికా మన దేశానికి ఎగుమతి చేసే 75 శాతం ఉత్పత్తుల విలువపై సగటు సుంకం 5 శాతం కంటే తక్కువగానే ఉంది. ఫలితంగా అమెరికా కొత్తగా సుంకం పెంచినప్పటికీ ప్రభావం ఎక్కువగా ఉండదని నిపుణులు భావిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎగుమతుల్లో 17.7 శాతం వాటాతో యూఎస్ భారత్‌కు ప్రధాన ఎగుమతి కేంద్రంగా ఉంది. అయితే, కొంతకాలంగా భారత్ అమెరికా లాంటి ఒకే మార్కెట్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. యూరప్, మధ్యప్రాచ్యం, ఇతర ప్రాంతాలలో పెరుగుతున్న వాణిజ్య సంబంధాలతో, సరఫరా నెట్‌వర్క్‌లను బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది.

Next Story