IDFC First Bank: ఐడీఎఫ్‌సీ బ్యాంకులో రూ. 590 కోట్ల భారీ మోసం

by S Gopi |

ఈ వ్యవహారంలో బ్యాంకు ఉద్యోగులే సూత్రధారులుగా ఉన్నట్టు తేలింది. దీనికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)కు ఐడీఎఫ్‌సీ బ్యాంకు సమాచారం ఇచ్చింది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు బ్యాంకు వెల్లడించింది.

IDFC First Bank: ఐడీఎఫ్‌సీ బ్యాంకులో రూ. 590 కోట్ల భారీ మోసం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రైవేట్ రంగ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో బారీ మోసం బయటపడింది. చండీగఢ్ నగరంలోని బ్యాంకు బ్రాంచు కేంద్రంగా రూ. 590 కోట్ల ఫ్రాడ్ జరిగింది. ఈ వ్యవహారంలో బ్యాంకు ఉద్యోగులే సూత్రధారులుగా ఉన్నట్టు తేలింది. దీనికి సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)కు ఐడీఎఫ్‌సీ బ్యాంకు సమాచారం ఇచ్చింది. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు బ్యాంకు వెల్లడించింది. తమ బ్యాంకులోని హర్యానా రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్‌కు సంబంధించి సుమారు రూ. 590 కోట్ల మోసాన్ని గుర్తించాం. ఒక ప్రభుత్వ శాఖ తన ఖాతాను మూసివేసి మరొక బ్యాంకుకు డబ్బును బదిలీ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ శాఖ పేర్కొన్న మొత్తం బ్యాంకులోని నిధులు, రికార్డులలో పేర్కొన్న బ్యాలెన్స్‌తో సరిపోలకపోవడంతో, తమకు అనుమానం వచ్చిందని, తనిఖీలు చేపట్టడంతో మోసం జరిగినట్టు నిర్ధారణకు వచ్చామని బ్యాంకు వివరించింది. ఈ వ్యవహారంలో బాధ్యులైన నలుగురు బ్యాంకు ఉద్యోగులను సస్పెండ్ చేశామని, క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా, బ్యాంకులో అక్రమాలు ఎలా జరిగాయనే విషయంపై దర్యాప్తు చేపడతామని, స్వతంత్ర సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్‌ను కూడా జరుపుతామని స్పష్టం చేసింది. ఈ ఘటన వల్ల సాధారణ ఖాతాదారుల సొమ్ముకు ఎలాంటి భయం అక్కరలేదని బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకైతే, రూ.590 కోట్ల మోసం జరిగిందని గుర్తించాం. పూర్తిస్థాయి విచారణ జరిగిన తర్వాత బ్యాంకుపై ఎంత ఆర్థిక ప్రభావం ఉంటుందనేది తెలుస్తుందని కంపెనీ పేర్కొంది.

Next Story