IDBI Bank: స్పెషల్ ఎఫ్‌డీ గడువు పొడిగించిన ఐడీబీఐ బ్యాంక్

by S Gopi |

కొత్త వడ్డీ రేట్లు శుక్రవారం(సెప్టెంబర్ 19) నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు స్పష్టం చేసింది.

IDBI Bank: స్పెషల్ ఎఫ్‌డీ గడువు పొడిగించిన ఐడీబీఐ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ప్రైవేట్ రంగ ఐడీబీఐ బ్యాంక్ ఖాతాదారులకు అధిక వడ్డీ అందించే లక్ష్యంతో ప్రారంభించిన స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ) గడువును పొడిగించింది. ఇదే సమయంలో ఇతర ఎఫ్‌డీలపైనా వడ్డీ రేట్లను సవరించినట్టు తెలిపింది. కొత్త వడ్డీ రేట్లు శుక్రవారం(సెప్టెంబర్ 19) నుంచే అమల్లోకి వస్తాయని బ్యాంకు స్పష్టం చేసింది. బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ వివరాల ప్రకారం, రూ. 3 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు అమలవుతాయి. దీనితో సవరించిన తర్వాత సాధారణ ఖాతాదారులకు వివిధ కాలవ్యవధులపై వడ్డీ 3 శాతం నుంచి 6.55 శాతం(స్పెషల్ ఎఫ్‌డీలు మినహా) మధ్య ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు అధికంగా 3.50 శాతం నుంచి 7.05 శాతం మధ్య వడ్డీ రాబడి ఉంటుంది.

స్పెషల్ ఎఫ్‌డీ కింద ఇస్తున్న 'ఉత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్' పథకం సెప్టెంబర్ 30తో ముగియనుంది. ఖాతాదారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఎఫ్‌డీలో మదుపు చేసేందుకు ఐడీబీఐ బ్యాంక్ 2026, మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 'ఉత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్' పథకం కింద బ్యాంకు 444 రోజులు, 555 రోజులు, 700 రోజుల కావ్యవధులపై అధిక వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇందులో 444 రోజుల ఎఫ్‌డీలపై సాధారణ ఖాతాదారులకు 6.6 శాతం, 555 రోజులకు 6.65 శాతం, 700 రోజులకు 6.50 శాతం వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్‌లకు అదనంగా 0.50 శాతం ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తోంది. 80 ఏళ్లు, ఆపైన ఎక్కువ వయసున్న సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 0.65 శాతం ఎక్కువ వడ్డీ బ్యాంకు అందిస్తోంది.

Next Story