- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AI: ఏఐ విప్లవానికి కౌంట్‌డౌన్ మొదలైంది
ఇది ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా మానవ సమాజ నిర్మాణాన్నే మార్చగలదని ఆయన చెబుతున్నారు.

దిశ, బిజినెస్ బ్యూరో: కృత్రిమ మేధ (ఏఐ) ఇప్పటికే మన పని విధానంతో పాటు జీవితాల్లోనూ అనేక మార్పులు తీసుకొచ్చింది. చాట్‌జీపీటీ, క్లాడ్, జెమిని ఏఐ, గ్రోక్ వంటి టూల్స్ ఈ-మెయిల్స్ రాయడం నుంచి డేటా విశ్లేషణ, ట్రావెల్ ప్లానింగ్, రోజువారీ పనుల నిర్వహణ వరకు అనేక రంగాల్లో ఉపయోగపడుతున్నాయి. అయితే ఇవి కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే మూడేళ్లలో ఏఐ ప్రభావం మరింత తీవ్రమవుతుందని గూగుల్ ఎక్స్ మాజీ బిజినెస్ చీఫ్ మో గౌడెట్ హెచ్చరిస్తున్నారు. ది డైరీ ఆఫ్ ఏ సీఈఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన, 2027 నాటికి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ) అంటే మనుషులతో సమానంగా లేదా అంతకంటే ప్రతిభావంతంగా పనిచేసే ఏఐ వాస్తవ రూపం దాల్చే అవకాశం ఉంది. ఇది ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా మానవ సమాజ నిర్మాణాన్నే మార్చగలదని ఆయన చెబుతున్నారు.
అసలు సవాలు ఏఐ టెక్నాలజీ కాదు, దాన్ని ఉపయోగించే సంస్థలు, ప్రభుత్వాలు, శక్తివంతమైన వ్యవస్థలే. ప్రస్తుతం మనం ఏఐని చాట్‌బాట్‌లు లేదా సోషల్ మీడియాలో కనిపించే కంటెంట్ రూపంలో చూస్తున్నాం. కానీ పరిశోధనల్లో ఏఐ వ్యవస్థలు తమ సొంత కోడ్‌ను మెరుగుపరుచుకోవడం, కొత్త సామర్థ్యాలను వేగంగా అభివృద్ధి చేసుకోవడం వంటి పరిణామాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మన అవగాహనకు, ఏఐ వాస్తవ సామర్థ్యాలకు మధ్య పెద్ద అంతరం ఏర్పడిందని, అదే భవిష్యత్తులో పెద్ద షాక్‌కు కారణం కావచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు.
వైట్-కాలర్ ఉద్యోగాలకే మొదటి దెబ్బ
ఉద్యోగాల విషయంలో మొదటి దెబ్బ వైట్-కాలర్ రంగాలకే తగలవచ్చని గౌడెట్ భావిస్తున్నారు. కాల్ సెంటర్ ఉద్యోగులు, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు, ట్రావెల్ ఏజెంట్లు, పారాలీగల్స్, ఫైనాన్షియల్ అనలిస్టులు, గ్రాఫిక్ డిజైనర్లు వంటి వృత్తుల్లో ఏఐ మనుషుల పనిని చాలా వరకు తగ్గించగలదని ఆయన అంచనా వేస్తున్నారు. అయితే ఈ మార్పు ఒక్కసారిగా ఉద్యోగాల తొలగింపుల రూపంలో కాకుండా, కొత్త నియామకాల తగ్గుదలతో ప్రారంభమవుతుందని చెప్పారు. కంపెనీలు క్రమంగా మనుషుల శ్రమకు బదులుగా ఏఐ ఆధారిత వ్యవస్థలను ఉపయోగించడం పెంచుతున్నాయని, ఇప్పటికే అనేక సంస్థలు ఎంట్రీ-లెవెల్ ఉద్యోగాల భర్తీని తగ్గించాయని ఆయన పేర్కొన్నారు. దీర్ఘకాలంలో రోబోటిక్స్ అభివృద్ధితో శారీరక శ్రమ ఆధారిత రంగాలపై కూడా ఇదే ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏఐతో పోటీ వద్దు
అయితే ఏఐ భవిష్యత్తు పూర్తిగా ప్రమాదకరమని తాను భావించడం లేదని గౌడెట్ స్పష్టం చేశారు. అధునాతన ఏఐ శాస్త్రీయ పరిశోధనలను వేగవంతం చేయడం, వైద్యం, విద్య, ఇంధనం వంటి రంగాల్లో కొత్త పరిష్కారాలను తీసుకురావడం ద్వారా మానవాళికి భారీ ప్రయోజనాలు అందించగలదని ఆయన విశ్వసిస్తున్నారు. ఏఐ ఆధారిత ప్రపంచంలో విజయవంతంగా నిలవాలంటే యువత ఏఐతో పోటీ పడే ప్రయత్నం చేయకుండా, దానితో కలిసి పనిచేయడం నేర్చుకోవాలని సూచిస్తున్నారు. సృజనాత్మకత, సానుభూతి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మానవ సంబంధాల నిర్మాణం వంటి గుణాలను యంత్రాలు సులభంగా అనుకరించలేవని, భవిష్యత్తులో అత్యంత విలువైన ఆస్తులుగా ఇవి మారనున్నాయని ఆయన పేర్కొన్నారు.






