HP: ఏఐ ఎఫెక్ట్.. 6 వేల మందిని తొలగించే యోచనలో హెచ్‌పీ

by S Gopi |

ప్రపంచవ్యాప్తంగా 4,000 నుంచి 6,000 మందిని తొలగించాలని భావిస్తున్నట్టు మంగళవారం ప్రకటనలో వెల్లడించింది.

HP: ఏఐ ఎఫెక్ట్.. 6 వేల మందిని తొలగించే యోచనలో హెచ్‌పీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ ఉద్యోగులకు లేఆఫ్ బెడద తప్పట్లేదు. ఇప్పటికే పలు టెక్ దిగ్గజాలు ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో తాజాగా కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ కూడ చేరింది. 2027-28 ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు(రెండు మూడేళ్లలో) ప్రపంచవ్యాప్తంగా 4,000 నుంచి 6,000 మందిని తొలగించాలని భావిస్తున్నట్టు మంగళవారం ప్రకటనలో వెల్లడించింది. కార్యకలాపాలను క్రమబద్దీకరించి, ఉత్పత్తిని మరింత వేగవంతం చేస్తూ, కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఉత్పాదకతను పెంచడానికి కృత్రిమ మేధస్సు(ఏఐ)ని ఉపయోగించే ప్రయత్నాల్లో భాగంగా కూడా ఉద్యోగులను తగ్గిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఈ లేఆఫ్స్ కారణంగా ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, అంతర్గత కార్యకలాపాలు, కస్టమర్ సపోర్ట్ విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితం అవుతారని హెచ్‌పీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్రిక్ లోర్స్ తెలిపారు.

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రకటన కారణంగా కంపెనీకి తయారీ ఖర్చులు పెరిగాయి. ఇదే సమయంలో చాలామంది కస్టమర్లు ఏఐ ఫీచర్ల కోసం కొత్త కంప్యూటర్లు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల మెమొరీ చిప్‌ల ఖర్చులు పెరిగాయి. అందుకే కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా వ్యయ భారాన్ని తగ్గించుకుని, ఉత్పత్తిని పెంచాలని భావిస్తోంది. ఈ నిర్ణయంతో సంస్థకు 1 బిలియన్ డాలర్ల(రూ. 8,925 కోట్ల) వరకు ఆదా అవుతుందని, ఈ మొత్తాన్ని మార్కెట్లో పోటీ ఎదుర్కొనేందుకు ఉపయోగిస్తామని ఎన్రిక్ వివరించారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో హెచ్‌పీ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా 1,000 నుంచి 2,000 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.

Next Story