అలా ఎలా జరిమానా విధిస్తారు..? భారత్ యాంటీ ట్రస్ట్ చట్టాన్ని సవాలు చేసిన యాపిల్

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-27 06:35:53  IST  )

భారత్‌లో యాంటీ ట్రస్ట్ చట్టం కింద తమపై విధించే జరిమానా లెక్కింపు నియమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించింది.

అలా ఎలా జరిమానా విధిస్తారు..? భారత్ యాంటీ ట్రస్ట్ చట్టాన్ని సవాలు చేసిన యాపిల్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో యాంటీ ట్రస్ట్ చట్టం కింద తమపై విధించే జరిమానా లెక్కింపు నియమాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించింది. 2022 నుంచి భారత స్టార్టప్ కంపెనీలతో పాటు టిండర్ ఓనర్ మ్యాచ్ గ్రూప్, తదితరులు ఆపిల్ యాప్ స్టోర్ విధానాలపై భారత పోటీ మండలి (Competition Council of India)లో ఫిర్యాదు చేశారు. ఐఫోన్ iOS యాప్ మార్కెట్‌లో ఆపిల్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని, యాప్ డెవలపర్లను తమ ఇన్-యాప్ పేమెంట్ సిస్టమ్ (In-App Payment System) ఉపయోగించేలా బలవంతం చేస్తూ 30 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తోందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే, వారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన CCI పిటిషనర్లు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తర్వాత యాపిల్ తప్పు చేసిందని నిర్ధారించింది. ఈ కేసులో ఆపిల్ ఇంక్ కంపెనీపై దాదాపు రూ. 3.15 లక్షల కోట్ల జరిమానా విధించే అవకాశం ఉంది.

ఈ క్రమంలోనే భారత్ యాంటీ ట్రస్ట్ చట్టాన్ని (India's Anti-Trust Law) సవాలు చేస్తూ యాపిల్ CCIలో 545 పేజీల కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ప్రపంచవ్యాప్త టర్నోవర్ ఆధారంగా జరిమానా విధించడం సరికాదని, అది రాజ్యాంగ విరుద్ధమని, అత్యంత అసమంజసమని తన వాదనలు వినిపించింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల సగటు గ్లోబల్ టర్నోవర్‌లో 10 శాతం వరకు జరిమానా పడితే అది 38 బిలియన్ డాలర్ల వరకు వెళ్తుందని కంపెనీ పేర్కొంది. దీంతో జరిమానాపై ప్రకటన వెలువడక ముందే యాపిల్ తాజాగా భారత్ యాంటీ ట్రస్ట్ చట్టాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)లో పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే, కేసు విచారణ వచ్చే వారం నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో యాపిల్ భవిష్యత్తు వ్యాపార విధానాలపై ఈ తీర్పు అత్యంత ప్రభావం చూపనుందని బిజినెస్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

Next Story