డీలర్‌షిప్‌ల పునరుద్ధరణకు హోండా కార్స్ ఇండియా రూ. 260 కోట్ల పెట్టుబడి!

by Disha Web Desk 22 |
డీలర్‌షిప్‌ల పునరుద్ధరణకు హోండా కార్స్ ఇండియా రూ. 260 కోట్ల పెట్టుబడి!
X

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా భారత్‌లోని తన డీలర్‌షిప్‌లను మరింత ప్రీమియంగా అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించింది. దీనికోసం కంపెనీ సుమారు రూ. 260 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహ్ల్ అన్నారు. ప్రస్తుతం కంపెనీ 242 నగరాల్లో 330 డీలర్ నెట్‌వర్క్‌లను కలిగి ఉంది. ఇదివరకు 2019లోనే కంపెనీ ఈ ప్రక్రియను ప్రారంభించాలని భావించినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా డీలర్ల వ్యాపారంపై ప్రభావం పడటంతో వెనక్కు తగ్గింది.

ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో మొత్తం సేల్స్ నెట్‌వర్క్‌ను పునరుద్ధరించడం, మరింత వేగంగా వృద్ధి సాధించడంపై దృష్టి సారించినట్టు కునాల్ పేర్కొన్నారు. మరో ఏడాది, రెండేళ్లలో పునరుద్ధరణ ద్వారా ఔట్‌లెట్ల సంఖ్యను పెంచాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన తెలిపారు. ప్రధానంగా హోండా కార్స్ ఇండియా ఎస్‌యూవీ విభాగంపై దృష్టి సారించింది, అందుకోసమే డీలర్‌షిప్‌ల అప్‌గ్రేడ్‌ను నిర్వహిస్తోంది. భవిష్యత్తులో ఎస్‌యూవీ వాహనాలకున్న గిరాకీని పరిగణలోకి తీసుకుని వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలందిస్తూ నెట్‌వర్క్‌లను తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు.


Next Story

Most Viewed