వచ్చే ఏడాది ఎస్‌యూవీ విభాగంలో కార్లను తీసుకురానున్న హోండా!

by Disha Web |
వచ్చే ఏడాది ఎస్‌యూవీ విభాగంలో కార్లను తీసుకురానున్న హోండా!
X

న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా కార్స్ ఇండియా భారత్‌లో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికోసం ఇటీవల అత్యంత వేగంగా పెరుగుతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్‌యూవీ) విభాగంలోకి తిరిగి ప్రవేశించాలని భావిస్తున్నట్టు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతానికి హోండాకు దేశీయ మార్కెట్లో ఎస్‌యూవీ మోడళ్లు లేనప్పటికీ, ఏటా 30 లక్షల కార్ల అమ్మకాలతో దేశీయ వాహన పరిశ్రమలో అతిపెద్ద బ్రాండ్‌గా కొనసాగుతోంది.

ఈ మధ్యకాలంలో హోండా కంపెనీ సీఆర్-వి, బీఆర్-వీ, సెలిలియో వంటి మోడళ్ల తయారీ నిలిపేసిన తర్వాత, సిటీ, సిటీ ఈహెచ్ఈవీ(హైబ్రిడ్) వంటి సెడాన్, కాంపాక్ట్ సెడాన్‌లో అమేజ్ మోడళ్లను మార్కెట్లో విక్రయిస్తోంది. గత కొన్నేళ్లలో వృద్ధిని మెరుగ్గా కొనసాగించేందుకు కంపెనీ అనేక చర్యలు తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విభాగం వైపునకు వెళ్లాలని నిర్ణయించినందున కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నామని హోండా కార్స్ ఇండియా సీఈఓ టకుయ ట్సుమురా చెప్పారు.

అయినప్పటికీ కొత్త ఈవీ విభాగం కోసం సౌకర్యాలు, కార్యకలాపాలను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. మిగిలిన మార్కెట్లతో పోలిస్తే భారత్ కీలకమైనది. దేశీయ మార్కెట్లో తమ అమ్మకాలను పెంచేందుకు అనుగుణంగా ఇటీవల పెరుగుతున్న ఎస్‌యూవీ విభాగంలో ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని టకుయ స్పష్టం చేశారు. దేశీయ ప్యాసింజర్ వాహనాల విభాగంలో హోండా వాటా 2019లో 5.44 శాతం నుంచి 2022లో 2.79 శాతానికి తగ్గింది. మునుపటి మార్కెట్ వాటాను అధిగమించే దిశగా వచ్చే ఏడాదిలో డిమాండ్ ఉన్న ఎస్‌యూవీ విభాగంలో కొత్త వాహనాలను తీసుకురానున్నట్టు కంపెనీ వెల్లడించింది.


Next Story