పెరుగుతున్న ఇండ్ల అమ్మకాలు.. ఆ 3 నగరాల్లోనే ఎక్కువ!

by Javid Pasha |

మూడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో గతేడాది అమ్మకాలు 15 % పెరిగాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌టైగర్ పేర్కొన్నది.

పెరుగుతున్న ఇండ్ల అమ్మకాలు.. ఆ 3 నగరాల్లోనే ఎక్కువ!
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇండ్ల అమ్మకాల్లో దక్షిణాది నగరాల హవా కొనసాగుతోంది. మూడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో గతేడాది అమ్మకాలు 15 % పెరిగాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌టైగర్ పేర్కొన్నది. దీంతో ఈ మూడు నగరాల్లో మొత్తం 1.33 లక్షల యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయని, మెరుగైన సరఫరా, అధిక డిమాండ్ కారణంగానే విక్రయాలు జరిగాయని వెల్లడించింది. గతేడాది ముంబైకి చెందిన లిస్టెడ్ కంపెనీ ఆరమ్ ప్రాప్‌టెక్ కొనుగోలు చేసిన తర్వాత ప్రాప్‌టైగర్ మొదటిసారి దేశంలోని ప్రధాన నగరాల స్థిరాస్తి అమ్మకాలపై డేటాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో విక్రయాలు క్షీణించినప్పటికీ, దక్షిణాదిలో పెరగడం గమనార్హం.

ఏ నగరాల్లో ఎంత శాతం?

ప్రాప్‌టైగర్ ప్రకారం.. మొత్తం 8 ప్రధాన నగరాల్లో గతేడాది ఇండ్ల అమ్మకాలు 4,36,992 యూనిట్ల నుంచి 12 % తగ్గి 3,86,365 యూనిట్లకు చేరుకున్నాయి. ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, పూణే, అహ్మదాబాద్‌లలో నివాస గృహాల అమ్మకాలు తగ్గినప్పటికీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాలో పెరిగాయి. 2025 ఏడాది మొత్తం ఇండ్ల అమ్మకాలకు మంచి గిరాకీ ఉంది. అయితే.. అటు కొనుగోలుదారులు జాగ్రత్తగా వ్యవహరించడం, ఇటు డెవలపర్లు సరైన సమయంలో సరఫరా తీసుకురావడంతో అమ్మకాలు స్థిరంగా కొనసాగాయని ఆరమ్ ప్రాప్‌టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఓంకార్ శెట్టి అన్నారు.

హైదరాబాద్‌లో 6 % ఎక్కువ

విడివిడి అమ్మకాల విషయానికొస్తే, మూడు దక్షిణాది నగరాలు రాణించాయి. బెంగళూరులో ఇండ్ల అమ్మకాలు 48,272 యూనిట్ల నుంచి 13 శాతం పెరిగి 54,414 యూనిట్లకు చేరాయి. చెన్నైలో అమ్మకాలు 16,044 యూనిట్ల నుంచి ఏకంగా 55 శాతం పెరిగి 24,892 యూనిట్లకు చేరుకోగా, హైదరాబాద్‌లో 51,337 యూనిట్ల నుంచి 6 % పెరిగి 54,271 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ మూడు దక్షిణాది నగరాలు కలిసి గతేడాది 1,33,577 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. ఇది అంతకుముందు ఏడాది 1,15,653 యూనిట్ల కంటే 15.5 శాతం ఎక్కువ. ఇక, కోల్‌కతాలో అమ్మకాలు 13,605 యూనిట్ల నుంచి 12 శాతం పెరిగి 15,172 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే.. ముంబై ప్రాంతంలో అమ్మకాలు 1,43,487 యూనిట్ల నుంచి 26 శాతం తగ్గి 1,05,595 యూనిట్లకు పడిపోయాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో అమ్మకాలు 41,029 యూనిట్ల నుంచి 35,711 యూనిట్లకు13% క్షీణించాయి. పూణెలో అమ్మకాలు 81,281 యూనిట్ల నుంచి 59,223 యూనిట్లకు 12 % తగ్గాయి. చివరగా, అహ్మదాబాద్‌లో ఇండ్ల అమ్మకాలు 41,937 యూనిట్ల నుంచి 37,087 యూనిట్లకు 12 % పడిపోయాయి.

Next Story