ఇళ్ల ధరలు మరో 10-15 శాతం పెరగొచ్చు!

by Disha Web Desk 17 |
ఇళ్ల ధరలు మరో 10-15 శాతం పెరగొచ్చు!
X

న్యూఢిల్లీ: డిమాండ్‌తో పాటు పెరుగుతున్న నిర్మాణ వ్యయం కారణంగా డెవలపర్లు తమ మార్జిన్‌లపై దృష్టి సారిస్తుండటంతో ఈ ఏడాది ఇళ్ల ధరలు పెరగనున్నాయి. దేశంలోని ప్రధాన ఎనిమిది ప్రధాన మార్కెట్లలో అన్ని నివాస ప్రాపర్టీల సగటు విలువ పెరిగాయని కొలియర్స్ ఇండియా తెలిపింది. గతేడాది నిర్మాణాల్లో వాడే కీలక ముడి పదార్థాల ధరలు 20-70 శాతం మధ్య పెరిగాయి. 2022, మార్చి నాటికి సిమెంట్, ఉక్కు ధరలు అంతకుముందు ఏడాది కంటే 20 శాతం ఖరీదయ్యాయి. దానివల్ల వార్షిక ప్రాతిపదికన అన్ని నగరాల్లో ఇళ్ల ధరలు చదరపు అడుగుకు 7 శాతం పెరిగాయి.

బెంగళూరులో అత్యధికంగా 7 శాతం, పూణెలో 5 శాతం, ముంబైలో 4 శాతం, హైదరాబాద్, చెన్నైలలో తక్కువగా 1 శాతం చొప్పున పెరిగాయని నివేదిక తెలిపింది. గత కొన్నేళ్ల నుంచి డెవలపర్లు అధిక రుణాలు, నగదు లభ్యతపై ఆందోళనల వల్ల ఒత్తిడికి గురయ్యారు. అందుకే నిర్మాణాల ధరలు పెరిగాయి. ఏప్రిల్‌లో ఇళ్ల ధరలు కనీసం 10-15 శాతం పెరిగే అవకాశాలున్నాయని పరిశ్రమ సంఘం క్రెడాయ్ తెలిపింది.

కొన్నేళ్ల నుంచి డెవలపర్లు తక్కువ మార్జిన్‌లతో కొనసాగారు. అయినప్పటికీ కరోనా నుంచి పరిశ్రమ కోలుకుంటున్న దశలో ఉన్నందున ఇప్పటివరకు వారు ధరలను పెంచడంలో జాగ్రత్తగా వ్యవహరించారని కొలియర్స్ ఇండియా సీఈఓ రమేష్ నాయర్ అన్నారు. అయితే, కీలక పదార్థాల పెరుగుదల రెండంకెల స్థాయిలో కొనసాగుతుండటంతో 2022, డిసెంబర్ నాటికే నిర్మాణ వ్యయం 8-9 శాతం పెరిగిందని రమేష్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed