HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీలో ఏఐ వల్ల ఉద్యోగుల తొలగింపులు ఉండవు

by S Gopi |

ప్రస్తుతం బ్యాంకు జనరేటివ్ ఏఐతో పాటు ఇతర టెక్ ప్రయోగాలు జరుపుతోంది.

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీలో ఏఐ వల్ల ఉద్యోగుల తొలగింపులు ఉండవు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కీలక వ్యాఖ్యలు చేసింది. అనేక రంగాల్లో కృత్రిమ మేధస్సు(ఏఐ) కారణంగా ఉద్యోగులను తొలగిస్తుంటే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో సైతం తమ బ్యాంకు ఉద్యోగులను ఏఐ కారణంగా తొలగించబోయేది లేదని సప్ష్టం చేసింది. ప్రస్తుతం బ్యాంకు జనరేటివ్ ఏఐతో పాటు ఇతర టెక్ ప్రయోగాలు జరుపుతోంది. మరో 2 ఏళ్లకు వాటి ప్రయోజనాలు కనిపిస్తాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శశిధర్ జగదీష్ అన్నారు. ఏఐ కారణంగా తమ బ్యాంకులో లేఆఫ్స్ ఉండవని, ఏఐను ఉపయోగించి బ్యాక్-ఎండ్‌లో ఉండే ఉద్యోగులను టెక్నాలజీ వైపు లేదా ఫ్రంట్-ఎండ్‌లో పనిచేసేలా చొరవ తీసుకుంటామని, దీన్నొక అవకాశంగా మాత్రమే తాము చూస్తున్నామని ఆయన తెలిపారు.

భారత ఆర్థిక సేవల రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధి విషయంలో భారత్ రన్‌వేపై దూసుకుపోతున్న మార్కెట్ అని జగదీషన్ అభిప్రాయపడ్డారు. దీన్ని కస్టమర్లతో సన్నిహితంగా ఉండటానికి, సాంకేతిక పరిణామాలు అందించే ఉత్తమమైన వాటిని అడాప్ట్ చేసుకోవడం ద్వారా ఆవిష్కరణలను కొనసాగించడానికి చాలా మంది అవసరం ఉంది. గడిచిన ఆరు నెలల కాలంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కొత్తగా 5,000 మందిని ఉద్యోగంలోకి తీసుకుంది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి బ్యాంకులో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.20 లక్షలకు పెరిగిందని ఆయన వివరించారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని, వినూత్న ఆవిష్కరణలు చేపట్టడం ద్వారా మరింత మెరుగ్గా ముందడుగు వేసే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇప్పటికైతే సాంకేతిక రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సమయం వచ్చినప్పుడు ఆ వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Next Story