బంగారం సీన్ మారిందా?.. మార్కెట్లో కొత్త ట్రెండ్!

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-01 06:35:31  IST  )

భారతీయ కుటుంబాల్లో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. వివాహాలు, పండగలు, వేడుకలు, పొదుపు, పెట్టుబడి.. ఏ కోణంలో చూసినా బంగారం మన జీవితంలో భాగమే. కానీ, ప్రస్తుతం దేశంలో సీన్ మారింది.

బంగారం సీన్ మారిందా?.. మార్కెట్లో కొత్త ట్రెండ్!
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ కుటుంబాల్లో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. వివాహాలు, పండగలు, వేడుకలు, పొదుపు, పెట్టుబడి.. ఏ కోణంలో చూసినా బంగారం మన జీవితంలో భాగమే. కానీ, ప్రస్తుతం దేశంలో సీన్ మారింది. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో బంగారు ఆభరణాల అమ్మకాలు మందగించినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం, ప్రజలు అత్యవసరం కాని బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విజ్ఞప్తి తర్వాత అమ్మకాలపై ప్రభావం కనిపించింది. బెంగళూరు, గౌహతి, ఢిల్లీ వంటి నగరాల్లో ఆభరణాల వ్యాపారులు వినియోగదారుల కొనుగోలు ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే, కొనుగోళ్లు తగ్గడానికి కేవలం ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మాత్రమే కారణమా? లేక ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా? మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? ఈ విషయాలను ఒకసారి పరిశీలిద్దాం..!

ధరలే పెద్ద అడ్డంకి

ప్రస్తుతం బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేనంత గరిష్టానికి చేరాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) గణాంకాల ప్రకారం, ఈ ఏడాది మే నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.1.58 లక్షలకు చేరుకుంది. ఈ స్థాయి ధరల వద్ద సామాన్యులు కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేయడం సహజమే. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు పెళ్లిళ్లు లేదా అత్యవసర అవసరాలు తప్ప కొత్తగా బంగారం కొనడానికి ఆసక్తి చూపడం లేదు.

ప్రధాని పిలుపుతో పడిపోయిన కొనుగోళ్లు

ప్రధాని మోడీ విజ్ఞప్తి చేసిన మొదటి 10 రోజుల్లో, దేశవ్యాప్తంగా పలు జ్యువెలరీ షాపుల్లో అమ్మకాలు ఏకంగా 80 శాతం మేర పడిపోయినట్లు ప్రముఖ వార్తా సంస్థలు చెబుతున్నాయి. అస్సాంలోని గౌహతిలో ఆభరణాల అమ్మకాలు భారీగా తగ్గాయని ‘ది అస్సాం ట్రిబ్యూన్’ పేర్కొంది. బెంగళూరులో కూడా అమ్మకాలు 30 శాతం తగ్గాయని ‘న్యూస్‌ఫస్ట్ ప్రైమ్’ నివేదించింది. ‘లోకల్‌సర్కిల్స్’ అనే సంస్థ చేసిన సర్వేలో మరింత ఆసక్తికరమైన విషయం బయటపడింది. ప్రధాని పిలుపు మేరకు.. ప్రతి 10 మంది కొనుగోలుదారులలో 6 మంది కనీసం ఏడాది పాటు బంగారం కొనకూడదని నిర్ణయించుకున్నారు.

ఆగని కొనుగోళ్లు

ఆభరణాల వ్యాపారుల ప్రకారం, వినియోగదారులు పూర్తిగా మార్కెట్‌ను వదిలిపెట్టలేదు. కానీ కొనుగోలు తీరు మారింది. ఎక్కువ గ్రాముల్లో ఆభరణాలను కొనే బదులు తక్కువ బరువు, రోజువారీ వినియోగానికి అనువైన డిజైన్లను ఎంచుకుంటున్నారని ఢిల్లీకి చెందిన ధీర్‌సన్స్ జ్యూవెలర్స్ చెబుతోంది. అలాగే పాత బంగారాన్ని ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకునే ఎక్స్చేంజ్ పథకాలపై ఆసక్తి పెరుగుతోంది. అంటే డిమాండ్ పూర్తిగా మాయమవ్వలేదు. ప్రజలు ఖర్చు విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.

సాధారణంగా డిమాండ్ తగ్గితే ధరలు పడిపోవాలి. కానీ బంగారం విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడమేనని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్ తర్వాత చాలా దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వల్లో బంగారం వాటాను పెంచుతున్నాయి. ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువల్లో హెచ్చుతగ్గులు, అంతర్జాతీయ ఉద్రిక్తతల నుంచి రక్షణ పొందడానికి బంగారాన్ని సురక్షిత ఆస్తిగా భావిస్తున్నాయి. దీంతో ప్రపంచ మార్కెట్‌లో బంగారానికి బలమైన డిమాండ్ కొనసాగుతోంది.

ప్రధాని బంగారం వద్దని ఎందుకు చెప్పారు?

ప్రధాని మోడీ వ్యాఖ్యలు వినియోగదారుల మనస్తత్వంపై కొంత ప్రభావం చూపి ఉండొచ్చు. కానీ బంగారం కొనుగోళ్లు తగ్గడానికి అది మాత్రమే కారణమని చెప్పడం కష్టం. ప్రధాని ప్రజలను బంగారం కొనవద్దని కోరడం వెనక చాలా పెద్ద ఆర్థిక కారణం ఉంది. మన దేశంలో తయారయ్యే ఆభరణాలకు అవసరమైన బంగారంలో 90 శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఏటా సగటున 800 టన్నుల బంగారాన్ని మనం కొంటున్నాం. దీనికోసం మన దగ్గర ఉన్న విదేశీ మారక నిల్వలను (డాలర్లను) భారీగా ఖర్చు చేయాల్సి వస్తున్నది.

బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయి?

అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం కారణంగా 2026 చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 1,90,000 నుంచి రూ. 2,10,000 వరకు చేరొచ్చని ధీర్‌సన్స్ జ్యువెలర్స్, జోత్వాని అసోసియేట్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కిలో వెండి ధర కూడా రూ. నాలుగు లక్షల వరకు వెళ్లొచ్చని చెబుతున్నారు. అయితే ‘ఫిన్‌డాక్ ఇన్వెస్ట్‌మార్ట్’ వ్యవస్థాపకుడు హేమంత్ సూద్ మాత్రం భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి బంగారం ధర రూ.1,28,000 నుంచి రూ. 1,45,000 మధ్యలో ఉండవచ్చని, ప్రస్తుతం ఉన్నంత వేగంగా రేట్లు పెరగకపోవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.

బిగ్ రిలీఫ్.. తగ్గిన బంగారం ధర

Next Story