- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
GST: కొత్త జీఎస్టీతో కేంద్రానికి రూ. 85,000 కోట్ల ఆదాయ నష్టం
ఈ నిర్ణయంతో వినియోగం పెరిగి జీడీపీకి 0.6 శాతం మేర సహకరిస్తుందని ఎస్‌బీఐ నివేదిక వివరించింది.

దిశ, బిజినెస్ బ్యూరో: రెండు శ్లాబ్‌ల నిర్మాణం, నిత్యావసరాలపై తక్కువ పన్ను రేట్ల ద్వారా ప్రతిపాదిత జీఎస్టీ సంస్కరణల కారణంగా ప్రభుత్వానికి ఏటా సగటున రూ. 85,000 కోట్ల ఆదాయ నష్టం ఏర్పడవచ్చని ఎస్‌బీఐ తన నివేదికలో పేర్కొంది. అయితే తక్కువ పన్ను రేట్ల కారణంగా వినియోగం రూ. 1.98 లక్షల కోట్ల మేర పెరుగుతుందని అభిప్రాయపడింది. కేంద్రం 'తదుపరి తరం జీఎస్టీ' ప్రతిపాదన కింద వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) 5, 18 శాతం శ్లాబ్‌లకు పరిమితం చేయాలని, వాటిని మెరిట్, స్టాండర్డ్‌గా వర్గీకరించాలని నిర్ణయించింది. అలాగే, పాన్, మసాలా, పొగాకు, లిక్కర్ సహా 5-7 వస్తువులను 40 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చింది. ఇవి కాకుండా బంగారం, వెండి, వజ్రం, ఆభరణాలపై 3 శాతం, కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలపై 1.5 శాతం, ముడి వజ్రాలపై 0.25 శాతం వంటి మూడు ప్రత్యేక రేట్లను కూడా ఉండనున్నాయి. ఈ దీపావళి నుంచి కొత్త జీఎస్టీ పన్ను అమలయ్యేలా చూడాలని ప్రధాని మోడీ సూచించారు. ఈ నిర్ణయంతో వినియోగం పెరిగి జీడీపీకి 0.6 శాతం మేర సహకరిస్తుందని, ద్రవ్యోల్బణం స్థిరంగా కొనసాగేందుకు దోహదపడుతుందని ఎస్‌బీఐ నివేదిక వివరించింది. జీఎస్టీ 2.0 వల్ల సగటున కేంద్రం రూ. 85 వేల కోట్ల ఆదాయం కోల్పోయే అవకాశం ఉన్నప్పటికీ, వ్యవస్థలో రూ. 1.98 లక్షల కోట్ల మేర వినియోగం పెరుగుతుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-మార్చి మధ్యకాలానికి కొత్త పన్ను అమలు వల్ల రూ. 45,000 కోట్ల ఆదాయ నష్టం ఏర్పడనుందని నివేదిక పేర్కొంది.






