GST: ఐదేళ్లలో రూ. 7.08 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతలు

by S Gopi |

ఒక్క 2024-25లోనే రూ. 2.23 లక్షల కోట్లకు వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ఎగవేతను అధికారులు గుర్తించినట్టు డేటా చెబుతోంది.

GST: ఐదేళ్లలో రూ. 7.08 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది మార్చితో ముగిసిన 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు గడిచిన ఐదేళ్లలో కేంద్ర జీఎస్టీ ఫీల్డ్ అధికారులు సుమారు రూ. 7.08 లక్షల కోట్ల విలువ చేసే జీఎస్టీ మోసాలను గుర్తించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో దాదాపు రూ. 1.79 లక్షల కోట్లు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) మోసాలు కూడా ఉన్నాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ సోమవారం పార్లమెంటుకు తెలియజేశారు. ఒక్క 2024-25లోనే రూ. 2.23 లక్షల కోట్లకు వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ఎగవేతను అధికారులు గుర్తించినట్టు డేటా చెబుతోంది. ఈ మొత్తానికి సంబంధిని 30,056 జీఎస్టీ ఎగవేత కేసులు నమోదవగా, ఇందులో సగానికి పైగా(15,283) కేసులు ఐటీసీ మోసాలకు సంబంధినవిగా, విలువ పరంగా రూ. 58,772 కోట్ల వరకు ఉంది.

అంతకుముందు 2023-24లో రూ. 2.30 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతలు జరిగాయి, ఇందులో రూ. 36,374 కోట్ల ఐటీసీ మోసాలు ఉన్నాయి. 2023లో రూ. 1.32 లక్షల కోట్లు, 2022లో రూ. 73,238 కోట్లు, 2021లో రూ. 49,384 కోట్ల జీఎస్టీ ఎగవేతలను అధికారులు గుర్తించారు. జీఎస్టీ సంబంధిత మోసాలను గుర్తించడానికి 2020లో ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి ఈ మోసాలను అధికారులు గుర్తిస్తారు. ఈడీ, సీబీఐ, డీఆర్ఐ, డీజీజీఐ సంస్థల మధ్య ఉన్న సమన్వయం కారణంగా జీఎస్టీ ఎగవేతలను గుర్తిస్తున్నట్టు అధికారులు తెలిపారు. వీటిని అరికట్టేందుకు అనేక చర్యలు కూడా తీసుకున్నారు. ఈ-వే బిల్లులు, రిజిస్ట్రేషన్ల తనిఖీలు, జీఎస్టీ రిటర్నుల ధృవీకరణ, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్‌లపై పరిమితి ద్వారా జీఎస్టీ ఎగవేతలను నిలువరిస్తున్నారు. ఈ కారణంగానే దేశ జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి.

Next Story