- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
GST Collections: జూలైలో 7.5 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు
జూలై నెలలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జూలై నెలలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం వచ్చింది. ఇది గతేడాది ఇదే నెలలో వచ్చిన మొత్తంతో పోలిస్తే 7.5 శాతం ఎక్కువ. ఈ వసూళ్లు ఆర్థిక కార్యకలాపాలు, అన్ని రంగాల్లో కొనసాగుతున్న మెరుగైన పనితీరును ప్రతిబింబిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వచ్చిన జీఎస్టీ ఆదాయం రూ. 2.37 లక్షల కోట్లు ఇప్పటివరకు ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో ఉన్నాయి. జూలై జీఎస్టీ ఆదాయం మొత్తం రూ. 1,96,000 కోట్లలో ఐజీఎస్టీ రూ.99,250 కోట్లు, సీజీఎస్టీ రూ.33,450 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.41,600 కోట్లు, సెస్ రూ.21,700 కోట్లు ఉన్నాయి. ముఖ్యంగా, దిగుమతుల నుండి సేకరించిన ఐజీఎస్టీ 10.3 శాతం పెరగడం విశేషం. ఇది పటిష్టమైన సరిహద్దు వాణిజ్యాన్ని సూచిస్తుంది.
ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్-జూలై మధ్య జీఎస్టీ వసూళ్లు 10.7 శాతం పెరిగి రూ.8.18 లక్షల కోట్లకు చేరుకున్నాయి. సమీక్షించిన కాలంలో దేశీయ లావాదేవీల నుంచి స్థూల జీఎస్టీ ఆదాయం 6.7 శాతం పెరిగి రూ.1.43 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దిగుమతుల నుంచి 9.7 శాతం అధికంగా రూ.52,712 కోట్ల ఆదాయం వచ్చింది. జూలై జీఎస్టీ వసూళ్లలో అత్యధికంగా మధ్యప్రదేశ్ 18 శాతం వృద్ధిని చూసింది. ఆ తర్వాత బీహార్ 16 శాతం, ఆంద్రప్రదేశ్ 14 శాతం, పశ్చిమ బెంగాల్ 12 శాతంతో జీఎస్టీ వసూళ్లలో వృద్ధిని సాధించాయి. మహారాష్ట్ర రూ.30,590 కోట్లతో అత్యధిక జీఎస్టీ ఆదాయం సంపాదించింది. దీని తర్వాత కర్ణాటక రూ.13,967 కోట్లు, గుజరాత్ రూ.11,358 కోట్లు సాధించాయి.






