బొమ్మల పరిశ్రమకు రూ. 3,500 కోట్ల పీఎల్ఐ ప్రయోజనాలిచ్చే యోచనలో ప్రభుత్వం!

by Disha Web Desk 12 |
బొమ్మల పరిశ్రమకు రూ. 3,500 కోట్ల పీఎల్ఐ ప్రయోజనాలిచ్చే యోచనలో ప్రభుత్వం!
X

న్యూఢిల్లీ: ఇప్పటికే పలు రంగాలకు పీఎల్ఐ పథకం ద్వారా ప్రోత్సాహకాలు అమలు చేసిన ప్రభుత్వం మరిన్ని రంగాలకు ఈ ప్రయోజనాలను అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) నిబంధనలకు అనుగుణంగా ఉన్న బొమ్మలకు రూ. 3,500 కోట్ల విలువైన పీఎల్ఐ పథకం ప్రయోజనాలను అందించేందుకు ప్రభుత్వం చర్చిస్తోందని ఓ అధికారి తెలిపారు. దేశీయ తయారీని గ్లోబల్ స్థాయిలో పోటీగా నిలిపేందుకు, ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులను పెంచడం వంటి అంశాల లక్ష్యంగా పీఎల్ఐ పథకం ప్రయోజనాలను ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లు, కస్టమ్స్ డ్యూటీలను 20 శాతం నుంచి 60 శాతానికి పెంచడం వంటి చర్యలు తీసుకుంది. దీనివల్ల దిగుమతులు తగ్గి, దేశీయ తయారీ ప్రోత్సాహానికి దోహదపడ్డాయని ప్రభుత్వాధికారి చెప్పారు.

తాజాగా, పీఎల్ఐ పథకం ప్రయోజనాలు అందించేందుకు కూడా ప్రభుత్వం కొన్ని సూచనలను పరిగణలోకి తీసుకుంటుంది. అందులో బీఐఎస్ ఉన్న బొమ్మలకు మాత్రమే ఈ పథకాన్ని అందించడం, అలాగే పీఎల్ఐ ప్రయోజనాలను వివధ పెట్టుబడుల శ్లాబ్‌ల ప్రకారం ఇవ్వొచ్చు. అవి రూ. 25-50 కోట్ల వరకు లేదా రూ. 100-200 కోట్ల వరకు ఉన్న వాటికి వర్తించవచ్చని అధికారి వివరించారు. అదేవిధంగా దేశీయ బొమ్మల పరిశ్రమ ఇప్పటికీ బొమ్మల తయారీలో కీలకమైన, దేశీయంగా తయారు చేయని విడి భాగాలను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పూర్తిగా భారత్‌లో తయారైన వాటికి పీఎల్ఐ పథకాన్ని ఇవ్వొచ్చని ఆయన వెల్లడించారు. ఈ ప్రతిపాదనలన్నీ మంత్రిత్వ శాఖ మధ్య చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ప్రభుత్వం 14 రంగాలకు రూ. 2 లక్షల కోట్ల విలువైన పీఎల్ఐ పథకాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed