Mobile Phones: మొబైల్ ఫోన్ల ఎగుమతుల కోసం కొత్త పీఎల్ఐ పథకం

by S Gopi |

ఈ కొత్త పథకానికి సుమారు రూ. 46,000 కోట్ల వ్యయం కావొచ్చు.

Mobile Phones: మొబైల్ ఫోన్ల ఎగుమతుల కోసం కొత్త పీఎల్ఐ పథకం
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌ను ప్రపంచ స్థాయి స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. వచ్చే నెలలో కొత్త 'ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక' (పీఎల్ఐ) పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కొత్త పథకానికి సుమారు రూ. 46,000 కోట్ల వ్యయం కావొచ్చు. ఈ కొత్త ప్రోత్సాహక ప్యాకేజీ, 2020లో ప్రారంభమైన మొదటి దశ పీఎల్ఐ పథకం ఆధారంగా రూపొందించారు. అప్పట్లో ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ దాదాపు రూ. 40,995 కోట్లతో ఈ పథకాన్ని ప్రారంభించింది. దేశంలో మొబైల్ ఫోన్ల తయారీని పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. మొదటి దశ పథకం విజయవంతం కావడంతో భారత్‌లో మొబైల్ తయారీ గణనీయంగా పెరిగి, ఎగుమతులు కూడా భారీ స్థాయికి చేరుకున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం, 2025లో స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు సుమారు రూ. 2.62 లక్షల కోట్లకు చేరాయి. కొత్త పథకం ప్రధానంగా ఎగుమతులను మరింత పెంచడంపై దృష్టి సారిస్తూనే, భారత్‌ను గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ తయారీ కేంద్రంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంగా ఉండనుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతున్నారు. పీఎల్ఐ పథకం విజయంతో, భారత్ స్మార్ట్‌ఫోన్ తయారీ, ఎగుమతి సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు కొత్త దశలోకి అడుగుపెడుతోంది.

Next Story