Nitin Gadkari: వాహనాల స్క్రాపింగ్ ద్వారా రూ. 40 వేల కోట్ల ఆదాయం

by S Gopi |

వాహనాలను స్క్రాప్ చేయడం మూలంగా ప్రభుత్వానికి ఆదాయంతో పాటు తద్వారా 70 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు

Nitin Gadkari: వాహనాల స్క్రాపింగ్ ద్వారా రూ. 40 వేల కోట్ల ఆదాయం
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో 97 లక్షల అనర్హమైన, కాలుష్య కారక వాహనాలను స్క్రాప్ చేయడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తు, సేవల పన్నులో రూ.40,000 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అన్నారు. శుక్రవారం ఏసీఎంఏ వార్షిక సమావేశంలో మాట్లాడిన గడ్కరీ.. ప్రస్తుత ఏడాదిలో ఆగష్టు వరకు 3 లక్షల వాహనాలను స్క్రాప్ చేశాం. అందులో 1.41 లక్షలు ప్రభుత్వ వాహనాలేనని చెప్పారు. పనికిరాని, కాలుష్యాన్ని పెంచే వాహనాలను స్క్రాప్ చేయడం మూలంగా ప్రభుత్వానికి ఆదాయంతో పాటు తద్వారా 70 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని గడ్కరీ పేర్కొన్నారు. స్క్రాప్ చేసిన తర్వాత అందించే సర్టిఫికేట్ ద్వారా వినియోగదారులు కొత్త వాహనాన్ని కొనే సమయంలో కనీసం 5 శాతం డిస్కౌంట్ ఇవ్వాలని కంపెనీలను కోరామని స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకు 16, 830 వాహనాలను స్క్రాప్ చేస్తున్నామని, ప్రైవేట్ రంగ ఇందులో రూ. 2,700 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు గడ్కరీ వెల్లడించారు. తాజా జీఎస్టీ సవరణ ద్వారా మొత్తం వాహన పరిశ్రమకు ప్రయోజనం ఉంటుంది. వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అనుకున్న విధంగా అమలైతే వాహనాల ముడిసరుకుల ఖర్చు కనీసం 25 శాతం మేర తగ్గుతుందని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు.

Next Story