IDBI Bank: ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై అనిశ్చితి

by S Gopi |

ఈ అంశంపై జరిగిన చర్చల సందర్భంగా ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని క్యాబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కార్యదర్శుల బృందం భావిస్తోంది.

IDBI Bank: ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై అనిశ్చితి
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత పెరగడం, పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గడం వంటి కారణాలతో ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణ ప్రక్రియపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సోమవారం బ్యాంకు వ్యూహాత్మక వాటా విక్రయంతో పాటు పెట్టుబడుల ఉపసంహరణ వ్యూహాన్ని సమీక్షిస్తున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ అంశంపై జరిగిన చర్చల సందర్భంగా ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని క్యాబినెట్ కార్యదర్శి టీవీ సోమనాథన్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కార్యదర్శుల బృందం భావిస్తోంది. ఈ బృందం బ్యాంక్ అమ్మకానికి సంబంధించిన వాల్యూయేషన్, టైమ్‌లైన్‌లను పునఃసమీక్షిస్తోంది. మార్కెట్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన అంచనాలను సవరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పెట్టుబడిదారుల నుంచి వచ్చిన ఆఫర్లు ప్రభుత్వ అంచనాల కంటే తక్కువగా ఉండటంతో ఐడీబీఐ బ్యాంకు వాటా విక్రయ ప్రక్రియకు ఈ ఫిబ్రవరిలో బ్రేక్ పడింది. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. కాగా, ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి డిస్ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 80,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా, ఐడీబీఐ బ్యాంక్ వాటా అమ్మకాన్ని ప్రథమార్థంలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటోంది.

Next Story