- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CAFE-III: కార్లకు కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు
2027-28 నుంచి 2031-32 మధ్య భారత్‌లో తయారయ్యే లేదా దిగుమతి అయ్యే ఎం1 కేటగిరీ ప్యాసింజర్ కార్లకు (డ్రైవర్‌తో కలిపి గరిష్టంగా తొమ్మిది మంది ప్రయాణించే వాహనాలు) ఇవి వర్తిస్తాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ (కేఫ్-3) నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. 2027 మార్చి 31తో ముగియనున్న ప్రస్తుత కేఫ్-2 స్థానంలో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 2027-28 నుంచి 2031-32 మధ్య భారత్‌లో తయారయ్యే లేదా దిగుమతి అయ్యే ఎం1 కేటగిరీ ప్యాసింజర్ కార్లకు (డ్రైవర్‌తో కలిపి గరిష్టంగా తొమ్మిది మంది ప్రయాణించే వాహనాలు) ఇవి వర్తిస్తాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, కార్బన్ ఉద్గారాలను దశలవారీగా కట్టడి చేయడం ఈ కొత్త నిబంధనల ప్రధాన లక్ష్యం. ఈ ముసాయిదాపై పరిశ్రమలు, ప్రజల నుంచి ఆగస్టు 6 వరకు సూచనలు స్వీకరిస్తామని ప్రభుత్వం తెలిపింది.
కొత్త నిబంధనల ప్రకారం కార్ల ఇంధన సామర్థ్య లక్ష్యాలను ప్రతి ఏడాది క్రమంగా కఠినతరం చేయనున్నారు. 2027-28లో 100 కిలోమీటర్లకు 3.996 లీటర్ల ఇంధన వినియోగ లక్ష్యాన్ని, 2031-32 నాటికి 3.3273 లీటర్లకు తగ్గించాలని ప్రతిపాదించారు. అదే సమయంలో కార్బన్ ఉద్గారాలను 94.76 గ్రాముల సీఓ2/కిమీ నుంచి 78.90 గ్రాముల సీఓ2/కిమీకి తగ్గించే లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో ఆటోమొబైల్ కంపెనీలకు మరింత ఇంధన సామర్థ్యం ఉన్న మోడళ్లను అభివృద్ధి చేయడానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ లభిస్తుంది. మరో కీలక మార్పుగా, ఇథనాల్, బయో-ఫ్యూయల్స్, కంప్రెస్డ్ బయో-గ్యాస్ (సీబీజీ) వినియోగానికి తొలిసారిగా కార్బన్ న్యూట్రాలిటీ ప్రయోజనాలను లెక్కించనున్నారు. అలాగే, ఇంధన పొదుపు టెక్నాలజీలను ఉపయోగించే తయారీదారులకు కంప్లయన్స్‌లో అదనపు ప్రయోజనాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో పరిశ్రమలో స్వచ్ఛమైన ఇంధన సాంకేతికతల వినియోగం మరింత వేగం కానుంది.






