- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Motor Insurance: పెరగనున్న థర్డ్ పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం
కొన్ని వాహనాల మోడల్‌ను బట్టి ప్రీమియం 20-25 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

దిశ, బిజినెస్ బ్యూరో: కార్లు, ద్విచక్ర వాహనదారులకు ఇకపై బీమా ఖర్చులు మరింత పెరగనున్నాయి. వాహనాల థర్డ్ పార్టీ మోటార్స్ ఇన్సూరెన్స్ పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే త్వరలో కార్లు, బైకులు కొనేవారిపై ప్రభావం పడనుంది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంలను సగటున 18 శాతం పెంచాలని బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్‌డీఏఐ) ప్రభుత్వానికి ప్రతిపాదించింది. కొన్ని వాహనాల మోడల్‌ను బట్టి ప్రీమియం 20-25 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ కార్లు, బైక్‌లు, టాక్సీలు, వాణిజ్య వాహనాలతో సహా అన్ని రిజిస్టర్డ్ వాహనాలకు మోటార్ వాహనాల చట్టం ప్రకారం మోటార్ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ప్రమాదం జరిగినప్పుడు వ్యక్తికి లేదా వారి వాహనానికి కలిగే నష్టం లేదా గాయాల నుంచి ఆర్థిక భారాన్ని కవర్ చేస్తుంది. అయితే, ఇది పాలసీదారుడి సొంత వాహనానికి జరిగే నష్టాన్ని కవర్ చేయదు.
నాలుగేళ్లుగా లేని పెంపు
గత నాలుగు సంవత్సరాలుగా ఈ విభాగంలో ఖర్చులు పెరుగుతున్నప్పటికీ, క్లెయిమ్‌ల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ థర్డ్-పార్టీ బీమా ప్రీమియంలలో మార్పులేదు. దీనివల్ల బీమా కంపెనీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ఉదాహరణకు, 2024-25లో ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ థర్డ్-పార్టీ బీమాపై క్లెయిమ్ చెల్లింపు, ప్రీమియం వసూళ్ల నిష్పత్తిలో 108 శాతం నష్టాన్ని నమోదు చేసింది. దీనర్థం సంస్థ ప్రీమియంలలో సంపాదించిన దానికంటే ఎక్కువ చెల్లించింది. గో డిజిట్, ఐసీఐసీఐ లాంబార్డ్ వంటి ప్రైవేట్ బీమా సంస్థలు కూడా వరుసగా 69 శాతం, 64.2 శాతం అధిక నష్ట నిష్పత్తులను నివేదించాయి. ఈ నేపథ్యంలో థర్డ్-పార్టీ ప్రీమియంలలో సవరణ అవసరమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపాదిత పెంపు కారణంగా కొత్తగా వాహనాలు కొనే వారికి భారం తప్పదు. ఉదాహరణకు, ప్రస్తుతం రూ. 2,000 థర్డ్-పార్టీ ప్రీమియం చెల్లించే కారు ఓనర్‌కు 20-25 శాతం పెంపు అమలు చేస్తే ప్రీమియం రూ. 2,360-2,500కి చేరుతుంది. ఇది ఆన్-రోడ్ ధరలో భాగమైనందున కొత్తగా కారు లేదా బైక్ ధరలు కూడా ఖరీదు కానున్నాయి. ప్రతిపాదిన పెంపుపై 2-3 వారాల్లో తుది నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.






