- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
EV Cars: ఈవీ కార్ల పథకం కింద దరఖాస్తు కోసం పోర్టల్ ప్రారంభించిన కేంద్రం
దేశీయ ఈవీ రంగంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి ఉన్న కంపెనీలకు తక్కువ దిగుమతి పన్ను ఆఫర్ చేస్తుందని మంత్రి వెల్లడించారు

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) కంపెనీలు స్థానికంగా తయారీని ప్రారంభించేలా ప్రోత్సహించేందుకు, పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించడానికి భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీని ప్రోత్సహించే పథకం(ఎస్‌పీఎంఈపీసీఐ) ద్వారా కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ఈ పథకం కింద దరఖాస్తులను స్వీకరించడానికి పోర్టల్‌ను ప్రారంభించారు. ఇది అక్టోబర్ 21 వరకు అందుబాటులో ఉంటుంది. గ్లోబల్ ఈవీ దిగ్గజాలు ఇప్పుడు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది దేశీయ ఈవీ రంగంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి ఉన్న కంపెనీలకు తక్కువ దిగుమతి పన్ను ఆఫర్ చేస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఈవీ దిగ్గజం టెస్లా తన కార్లను విక్రయించడానికి దేశంలో షోరూమ్‌లను తెరవడానికి మాత్రమే ఆసక్తి చూపుతోందని, దేశంలో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడానికి మొగ్గు చూపడం లేదని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. టెస్లా వంటి కంపెనీలను ఈ పథకం ద్వారా తయారీలోకి రావాలని ఆహ్వానించారు. అమెరికా, జర్మనీ, వియత్నాం, యూకే, చెకోస్లోవేకియాతో సహా వివిధ దేశాల రాయబార కార్యాలయాలకు అధికారిక సమాచారం ఇస్తామని తెలిపారు.
ఇప్పటికే 4-5 కార్ల తయారీ కంపెనీలు ఈ పథకంపై ఆసక్తిని చూపించాయని మంత్రి పేర్కొన్నారు. అయితే, రానున్న రోజుల్లో వాస్తవానికి ఎన్ని కంపెనీలు దీని కోసం దరఖాస్తు చేసుకుంటాయో చూడాలన్నారు. ఈ పథకం కింద గ్లోబల్ ఈవీ కంపెనీలు ఆమోదం తేదీ నాటి నుంచి ఐదేళ్ల కాలానికి కనీసం 35,000 డాలర్ల(రూ. 30 లక్షలు) సీఐఎఫ్(కారు ధర, బీమా, రవాణా కలిపి) విలువతో పూర్తిగా తయారైన వాహనాల(సీబీయూ) ఇ-4వీలర్ దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. అది కూడా 15 శాతం తక్కువ కస్టమ్స్ సుంకంతో దిగుమతి చేసుకోవచ్చు. ఈ పథకం నిబంధనలకు సంబంధించి ఆమోదించిన కంపెనీలు కనీసం రూ.4,150 కోట్ల పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది.






