Budget-2025: ఈసారి బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ఆరేళ్లలోనే అత్యధిక కేటాయింపులు

by S Gopi |

గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించారు.

Budget-2025: ఈసారి బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ఆరేళ్లలోనే అత్యధిక కేటాయింపులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: మరో వారం రోజుల్లో వెలువరించే 2025-26 ఆర్థిక సంవత్సరం యూనియన్ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి భారీ కేటాయింపులు ఉండనున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెంచేందుకు, ద్రవ్యోల్బణాన్ని నిలువరించేందుకు వ్యవసాయ రంగానికి 15 శాతం అధికంగా రూ. 1.75 లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 1.52 లక్షల కోట్లు కేటాయించారు. ఈ నిర్ణయం నిజమైతే వ్యవసాయ రంగానికి గత ఆరేళ్లలోనే అత్యధిక కేటాయింపులు జరగనున్నాయి. ఎక్కువ కేటాయింపుల ద్వారా అధిక దిగుబడినిచ్చే విత్తన రకాలను అభివృద్ధి చేయడం, నిల్వ, సరఫరా మౌలిక సదుపాయాలను పెంచడం, పప్పుధాన్యాల పంటలు, నూనె గింజలు, కూరగాయలు, పాల ఉత్పత్తులను పెంచేందుకు అదనపు నిధులు సమకూరుతాయని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా దేశంలో ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయి. ఇది 2024లో సగటున 6 శాతానికి పైగా పెరిగింది. దీన్ని అరికట్టేందుకు కేంద్రం గోధుమలతో సహా కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై పరిమితులను విధించింది. కొన్ని రకాల పప్పు ధాన్యాలకు సుంకం రహిత దిగుమతి విధానాన్ని పొడిగించింది. దేశంలోని శ్రామికశక్తిలో 45 శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగంలో ఎగుమతులను 2030 నాటికి ప్రస్తుత రూ. 4.32 లక్షల కోట్ల నుంచి రూ. 7 లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా ఉంది. ఈ క్రమంలో బడ్జెట్‌లో కేటాయింపుల ద్వారా ఈ లక్ష్యాన్ని చేరే ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వం ఆశిస్తోంది. అలాగే, బడ్జెట్‌లో సబ్సిడీ వ్యవసాయ రుణాల పరిమితిని ప్రతి రైతుకు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలు పెంచాలని, పంట బీమాను మరింత మందికి చేరవేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Next Story