UPI: మరిన్ని దేశాలకు యూపీఐ విస్తరణ: డీఎఫ్‌ఎస్ కార్యదర్శి

by S Gopi |

ప్రస్తుతం దేశంలో యూపీఐ ద్వారా లావాదేవీలు సుమారు 50 శాతం డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి.

UPI: మరిన్ని దేశాలకు యూపీఐ విస్తరణ: డీఎఫ్‌ఎస్ కార్యదర్శి
X

దిశ, బిజినెస్ బ్యూరో: మనదేశ స్వదేశీ డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)ని మరిన్ని దేశాలకు విస్తరించడంపై దృస్ఠి సారిస్తున్నట్టు ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు. అంతర్జాతీయ ఉనికిని విస్తృతం చేస్తూఉ, ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ముఖ్యంగా తూర్పు ఆసియా మార్కెట్లలో యూపీఐ పరిధిని విస్తరించడంపై దృష్టి సారిస్తోందన్నారు. మంగళవారం జరిగిన గ్లోబల్ ఇంక్లూజివ్ ఫైనాన్స్ ఇండియా సమ్మిట్‌లో మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం దేశంలో యూపీఐ ద్వారా లావాదేవీలు సుమారు 50 శాతం డిజిటల్ రూపంలో జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలకు యూపీఐని విస్తరించాం. ఇప్పుడు మరిన్ని దేశాలకు, ముఖ్యంగా తూర్పు ఆసియాపై దృష్టి సారిస్తున్నామని అన్నారు. యూపీఐ ఇప్పటికే ఎనిమిది దేశాలలో — భూటాన్, సింగపూర్, ఖతార్, మారిషస్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), శ్రీలంక, ఫ్రాన్స్ — అందుబాటులో ఉంది. దీనివల్ల భారతీయ ప్రయాణికులు యూపీఐని ఉపయోగించి విదేశాలలో డిజిటల్ చెల్లింపులు చేయడానికి వీలవుతోందని నాగరాజు చెప్పారు. గతేడాది డిసెంబర్‌లో యూపీఐ లావాదేవీలు 2,100 కోట్లకు పైగా జరిగాయని నాగరాజు తెలిపారు. ఇది దేశంలో డిజిటల్ చెల్లింపుల వేగాన్ని సూచిస్తుందన్నారు.

ఇదే సమయంలో దేశంలో కొన్ని కోట్ల మైక్రో యూనిట్ సంస్థలు ఉన్నప్పటికీ, అవి మధ్య తరహా, పెద్ద సంస్థలుగా ఎదగడం లేదని అభిప్రాయపడ్డారు. మైక్రో యూనిట్లను మధ్య తరహా సంస్థలుగా మార్చాల్సిన అవసరం ఉందని ఎం నాగరాజు స్పష్టం చేశారు. మైక్రో సంస్థలకు మద్దతు, మార్కెట్ యాక్సెస్, సాంకేతికతతో పాటు హార్డ్‌వేర్ ద్వారా ఉత్పాదకత లాభాలు లభించినప్పుడే ఇది జరుగుతుందని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

Next Story