PSBs: ప్రభుత్వ బ్యాంకులను 4కి తగ్గించే యోచనలో కేంద్రం

by S Gopi |

2020లో కేంద్ర ప్రభుత్వం 27 బ్యాంకులను విలీనం ద్వారా 12కు తగ్గించిన సంగతి తెలిసిందే

PSBs: ప్రభుత్వ బ్యాంకులను 4కి తగ్గించే యోచనలో కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీ విలీన ప్రక్రియను చేపట్టాలని భావిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనే దీన్ని నిర్వహించాలని, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రంగ బ్యాంకులను 12 నుంచి నాలుగింటికి తగ్గించాలని చూస్తోంది. ఇదే గనక పూర్తయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ), కెనరా-యూనియన్ బ్యాంకుల విలీనం ద్వారా కొత్త బ్యాంకు ఏర్పాటు కానుంది. ఇదివరకు 2020లో కేంద్ర ప్రభుత్వం 27 బ్యాంకులను విలీనం ద్వారా 12కు తగ్గించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాలుగింటికి తగ్గించే ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయని మనీకంట్రోల్ తన కథనంలో పేర్కొంది. బ్యాలెన్స్ షీట్‌లను మరింత పటిష్టం చేయడం, కార్యకలాపాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, అంతర్జాతీయ బ్యాంకుల స్థాయిలో వీటిని పోటీ పడేలా సిద్ధం చేయడం వంటి చర్యలపై మంత్రిత్వ శాఖ పనిచేస్తున్నది.

ప్రస్తుత 12 బ్యాంకుల సంఖ్యను నాలుగుకు తగ్గించడం ప్రభుత్వ ప్రణాళికగా ఉంది. ఆ తర్వాత చిన్న బ్యాంకులను ముందుగా పెద్ద బ్యాంకులలో విలీనం చేసి, ఆపై దేశ వృద్ధి అవసరాలకు మద్దతు ఇవ్వగల పెద్ద బ్యాంకులుగా మార్చనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

కెనరా-యూనియన్ బ్యాంకుల విలీనం

కేంద్రం కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను విలీనం చేయాలని చూస్తోంది. ఇది నాలుగు అతిపెద్ద పీఎస్‌బీల ఒకటిగా ఏర్పడుతుంది. ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్‌లను కూడా ఏదోక పెద్ద బ్యాంకులో విలీనం చేయడంపై పరిశీలిస్తున్నారు. దీని వల్ల ఎస్‌బీఐ, పీఎన్‌బీ, బీఓబీలు మిగిలిన ప్రధాన బ్యాంకులుగా మారనున్నాయి. ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలను కూడా విలీనం చేయనున్నారు.

Next Story