ABS: మరింత ఆలస్యం కానున్న అన్ని బైకుల్లో ఏబీఎస్

by S Gopi |

ఏబీఎస్ అమలుకు మరింత సమయం కావాలని కంపెనీలు కొరాయి.

ABS: మరింత ఆలస్యం కానున్న అన్ని బైకుల్లో ఏబీఎస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అన్ని ద్విచక్ర వాహనాల్లో జనవరి 1 నుంచి యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ (ఏబీఎస్) తప్పనిసరి చేయడానికి ఉద్దేశించిన గడువును కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసే అవకాశం ఉంది. ప్రధాన ద్విచక్ర వాహన తయారీ కంపెనీలతో జరిగిన అనేక రౌండ్ల చర్చల తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏబీఎస్ అమలుకు మరింత సమయం కావాలని కంపెనీలు కొరాయి. ఈ ఏడాది జూన్‌లో ఏబీఎస్ తప్పనిసరి నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ, ఇంత తక్కువ సమయంలో అవసరమైన మార్పులు చేయడం, విడిభాగాల లభ్యత వంటి సమస్యల గురించి కంపెనీలు ప్రభుత్వానికి వివరించాయి. దీనికోసం కనీసం ఏడాది సమయం కావాలని అభ్యర్థించాయి. ప్రస్తుతం 125సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలకు మాత్రమే ఏబీఎస్ తప్పనిసరి నిబంధన ఉంది. అయితే, 125సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న వాటికి కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (సీబీఎస్) ఉంది. సాధారణంగా 125సీసీ కంటే తక్కువ సామర్థ్యం ఉన్న టూవీలర్ల ధరలు తక్కువగా ఉంటాయి. ఏబీఎస్ తప్పనిసరి అనే నిబంధన కారణంగా ధరలు గణనీయంగా పెరుగుతాయి. దీనివల్ల ఈ విభాగంలో డిమాండ్‌ ప్రభావితం అవుతుందని కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఈ కమ్యూటర్ మోడళ్లపై ఏబీఎస్ అమర్చడం వల్ల ధరల పెరుగుదల వేల రూపాయల్లోనే పెరగవచ్చని అంచనా.

Next Story