LIC: ఎల్ఐసీలో 2-3 శాతం వాటాను విక్రయించనున్న కేంద్రం

by S Gopi |   (  Updated:2025-03-12 18:30:21  IST  )

2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా స్టాక్ మార్కెట్ల పరిస్థితుల ఆధారంగా వాటా విక్రయ ప్రక్రియను చేపట్టనుంది

LIC: ఎల్ఐసీలో 2-3 శాతం వాటాను విక్రయించనున్న కేంద్రం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా ప్రభుత్వ రంగ దిగ్గజ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీలో ప్రభుత్వం తన వాటాను విక్రయించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 2027 నాటికి పబ్లిక్ షేర్ హోల్డింగ్‌ను 10 శాతం ఉంచాలనే సెబీ నిబంధనలు ఉండటంతో ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోనుంది. దీనికోసం ఎల్ఐసీలో 2-3 శాతం మేర ప్రభుత్వం తన వాటాను విక్రయించనుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా స్టాక్ మార్కెట్ల పరిస్థితుల ఆధారంగా వాటా విక్రయ ప్రక్రియను చేపట్టనుంది. ప్రస్తుతం కొన్ని వారాలుగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డు స్థాయిలో పతనాలను చూస్తోంది. రానున్న రోజుల్లో మార్కెట్లు పుంజుకుంటే దశల వారీగా వాటా విక్రయాన్ని అమలు జరుగుతుందని నివేదికలు పేర్కొన్నాయి. వ్యూహాత్మక, దశలవారీగా ఎల్ఐసీలో ప్రభుత్వం తన హోల్డింగ్‌ విలువను ఆప్టిమైజ్ చేయాలని చూస్తోంది. వన్-టైమ్ ఆఫర్‌కు బదులుగా, ఎల్ఐసీ షేర్ విలువను స్థిరంగా కొనసాగించేందుకు విక్రయ ప్రక్రియను రెండు రౌండ్‌లుగా నిర్వహించవచ్చు. ఒకవేళ మార్కెట్ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే, ప్రభుత్వం షేర్ హోల్డింగ్ నిబంధన పొడిగింపును కొరే అవకాశం ఉందని సమాచారం. కాగా, 2022, మే నెలలో ఎల్ఐసీ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన సంగతి తెలిసిందే. 3.5 శాతం వాటాకు సమానమైన రూ. 22.13 కోట్ల విలువైన షేర్లను ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. ప్రస్తుతం ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉండగా, ఇందులో మరో 2-3 శాతం విక్రయించడం ద్వారా రూ. 9,500-14,500 కోట్ల మేర నిధులను సమీకరించనుంది. గతేడాది మే నెలలోనే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఎల్ఐసీలోని కనీస పబ్లిక్ వాటా 10 శాతానికి చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఆ గడువును 2027, మే 16కి పొడిగించింది.

READ MORE ...

Savings Scheme: ప్రతి నెలా రూ. 5 వేలు పెట్టుబడి పెట్టండి.. లక్షలు సంపాదించండి.. పోస్టాఫీస్‌లో సూపర్‌ స్కీమ్‌ ఇ...


Next Story