LIC: పెట్టుబడి నిర్ణయాలపై ఎల్ఐసీకి ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వదు: ఆర్థిక మంత్రి

by S Gopi |

ఐఆర్‌డీఏఐ, ఆర్‌బీఐ, సెబీ నిబంధనల ఆధారంగా ఎల్ఐసీ పెట్టుబడులు పెడుతుంది.

LIC: పెట్టుబడి నిర్ణయాలపై ఎల్ఐసీకి ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వదు: ఆర్థిక మంత్రి
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కి ఎలా పెట్టుబడి పెట్టాలనే దానిపై ఎటువంటి సలహా లేదా దిశానిర్దేశం ఇవ్వలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం స్పష్టం చేసింది. ఎల్ఐసీ తీసుకునే పెట్టుబడి నిర్ణయాలు స్వతంత్రంగా ఉంటాయని, కఠినమైన చర్యలు, రిస్క్ అంచనా, సరైన అనుమతుల ద్వారానే జరుగుతాయి. బీమా చట్టం-1938 నిబంధనలు, అలాగే ఐఆర్‌డీఏఐ, ఆర్‌బీఐ, సెబీ నిబంధనల ఆధారంగా ఎల్ఐసీ పెట్టుబడులు పెడుతుంది. ఈ విషయం గురించి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. మంత్రిత్వ శాఖ లేదా ఆర్థిక సేవల విభాగం, ఎల్ఐసీ లేదా ఇతర ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలకు అదానీ గ్రూప్ కంపెనీలలో పెట్టుబడి పెట్టడంపై ఎలాంటి ఆదేశాలు లేదా సలహాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అదానీ గ్రూప్‌ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి ఎల్‌ఐసీకి ఆర్థిక మంత్రిత్వశాఖ ఆదేశాలిచ్చినట్టు అమెరికాకు చెందిన వాషింగ్టన్‌ పోస్ట్‌ రెండు నెలల క్రితం కథనం వెలువరించిన సంగతి తెలిసిందే. దీన్ని ఎల్‌ఐసీ ఖండించింది. పెట్టుబడులు పూర్తిగా తమ సొంత నిర్ణయమని ప్రకటన జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్‌లో అడిగిన ఓ ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ సమాధానమిచ్చారు. ఎల్‌ఐసీ పెట్టుబడులకు సంబంధించి సొంతంగానే నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు.

ఎల్ఐసీ పెట్టుబడులు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలోని టాప్ 500 కంపెనీలలో పెట్టుబడి పెడుతుందని ఆర్థిక మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఎల్ఐసీ పెట్టుబడుల్లో ఎక్కువ భాగం పెద్ద కంపెనీలలో ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి నిఫ్టీ 50 కంపెనీలలో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ. 4.31 లక్షల కోట్లు, ఇది మొత్తం ఈక్విటీ పెట్టుబడిలో 45.85 శాతానికి సమానమని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ డెట్ సెక్యూరిటీలలోని పెట్టుబడులను కలుపుకుంటే ఇది రూ. 9.4 లక్షల కోట్లు ఉంటాయని నిర్మలా సీతారామన్ చెప్పారు.

Next Story