- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Social Media Platforms: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కేంద్రం కీలక ఆదేశాలు
ఏఐ జనరేటెడ్ కంటెంట్‌పై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా లేబులింగ్ విధానం అమలు చేయడంతో పాటు టెక్నాలజీ దుర్వినియోగాన్ని పర్యవేక్షించాలని ప్లాట్‌ఫామ్‌లను కోరింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో రూపొందిన కంటెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ కారణంగా ఎదురవుతున్న కొత్త సవాళ్లను అధిగమించేందుకు, ఏఐ కంటెంట్ నిబంధనలను కఠినతరం చేసింది. ఏఐ జనరేటెడ్ కంటెంట్‌పై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా లేబులింగ్ విధానం అమలు చేయడంతో పాటు టెక్నాలజీ దుర్వినియోగాన్ని పర్యవేక్షించాలని ప్లాట్‌ఫామ్‌లను కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఏఐ ఉపయోగించి సృష్టించిన కంటెంట్‌ను గుర్తించి, లేబుల్ చేసి, నియంత్రించాలని ఆదేశిస్తూ కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది. డీప్‌ఫేక్‌లు, తప్పుదారి పట్టించే వీడియోలు, నకిలీ డాక్యుమెంట్లు, అసభ్య కంటెంట్ వంటి ఏఐ-జనరేటెడ్ కంటెంట్ దుర్వినియోగాన్ని ఆపే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకుంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) సవరణ నియమాలు, 2026 కింద ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త నియమాలు ఫిబ్రవరి 20 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది.
ఏఐ-జనరేటెడ్ కంటెంట్ అత్యంత సాధారణం, యూజర్లు నిజమైన కంటెంట్ గుర్తించడం కూడా కష్టతరం కావడంతో సోషల్ ప్లాట్‌ఫామ్‌లు ఎక్కువ బాధ్యత వహించాలని ప్రభుత్వం చెబుతోంది. దీనికోసం..
ఆటోమెటెడ్ చెక్
చట్టవిరుద్ధమైన ఏఐ-జనరేటెడ్ కంటెంట్ క్రియేట్, షేర్ చేయకుండా కట్టడి చేసేందుకు ఆటోమేటెడ్ టూల్స్, టెక్నికల్ సిస్టమ్స్ అమలు చేయాలని ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశించింది.
ప్లాట్‌ఫామ్‌లు వాడే టూల్స్ ప్రభుత్వం సూచించిన కంటెంట్‌ను గుర్తించి బ్లాక్ చేయాలని తెలిపింది. అవి..
* ప్రభుత్వం నిర్దేశించిన చట్టాలను ఉల్లంఘించే కంటెంట్
* పిల్లల లైంగిక వేధింపులకు చెందిన కంటెంట్
* అనుమతి లేకుండా షేర్ లేదా క్రియేట్ చేసిన ప్రైవేట్, సెక్సువల్ ఫోటోలు, వీడియోలు
* నకిలీ డాక్యుమెంట్లను ఉపయోగించడం
* వ్యక్తులు, సమాచారం గురించి నిజాలను వక్రీకరించి ప్రజలను మోసం చేసే కంటెంట్.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పైన పేర్కొన్న ఉల్లంఘనల గురించి తెలుసుకున్న తర్వాత, తక్షణం చర్యలు తీసుకోవాలి. ఇందులో కంటెంట్‌ను తొలగించడం, బ్లాక్ చేయడం, సదరు యూజర్ అకౌంట్‌ను సస్పెండ్ చేయడం, అవసరమైతే చట్ట ప్రకారం సంబంధిత సంస్థలతో యూజర్ వివరాలను పంచుకోవడం తప్పనిసరి అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏఐ-జనరేటెడ్ కంటెంట్‌పై స్పష్టమైన లేబులింగ్
ఏఐ-జనరేటెడ్ అన్ని రకాల కంటెంట్ చట్టవిరుద్ధం కాదు. కానీ ప్రభుత్వం యూజర్లు ఏది నిజమైనదో, కంప్యూటర్-జనరేటెడ్ అనేది స్పష్టంగా తెలుసుకోవాలని ఆశిస్తోంది.
కొత్త నిబంధనల ప్రకారం, ప్లాట్‌ఫామ్‌లు అన్ని ఏఐ-జనరేటెడ్ కంటెంట్‌ను ఖచ్చితంగా లేబుల్ వేయాలని తెలిపింది. ఈ లేబుల్స్ యూజర్లకు స్పష్టంగా కనిపించాలి. కంప్యూటర్ టూల్స్, ఏఐని ఉపయోగించి కంటెంట్ జనరేట్ చేసినట్టు పేర్కొనాలి. లేబుల్స్‌తో పాటు, ప్లాట్‌ఫామ్‌లు ఏఐ-జనరేటెడ్ కంటెంట్‌పై లేబుల్ వేసిన తర్వాత లేబుల్‌ను గానీ, మెటా డేటాను గానీ తొలగించడానికి, కనిపించకుండా చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా, సదరు కంటెంట్ ఎంబెడెడ్ మెటాడేటా లేదా డిజిటల్ ఐడెంటిఫైయర్‌లను కలిగి ఉండాలి. అంటే, ఆ కంటెంట్‌పై శాశ్వత డిజిటల్ ట్యాగ్ ఉండేలా చూసుకోవాలి, దాన్ని యూజర్లు షేర్ చేసినప్పుడల్లా దాంతో పాటు ఉండాలి.
నకిలీ లేదా హానికరమైన ఏఐ కంటెంట్‌ను ఫ్లాగ్ చేసిన తర్వాత తక్షణం తొలగించాలి. ఏవైనా ఏఐ జనరేటెడ్, డీప్‌ఫేక్ కంటెంట్‌ను తొలగించాలని ప్రభుత్వం లేదా కోర్టులు ఆదేశిస్తే, దాన్ని మూడు గంటల్లోనే తొలగించాలని కేంద్రం గడువు విధించింది. గతంలో ఇందుకు 36 గంటల గడువుకు ఉండేది.
యూజర్ల బాధ్యత కూడా
ఈ నిబంధనలు ప్లాట్‌ఫామ్‌లకు మాత్రమే కాకుండా, యూజర్ల బాధ్యతను కూడా గుర్తుచేశాయి. దిగ్గజ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు యూజర్లు అప్‌లోడ్ చేసే కంటెంట్ కృత్రిమంగా ఉత్పత్తి చేసినదా అని అడగాలి. ప్లాట్‌ఫామ్‌లు కంటెంట్‌ను పబ్లిష్ అవడానికి ముందు టెక్నికల్ టూల్స్ ద్వారా సమీక్షించాలి.
ఏదైనా ప్లాట్‌ఫామ్ ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘించి ఏఐ-జనరేటెడ్ కంటెంట్‌ను పబ్లిష్ చేసేందుకు అనుమతిస్తే, అది చట్టపరమైన చర్యలను ఎదుర్కొనక తప్పదు.
జరిమానా తప్పదు
చట్ట విరుద్ధమైన ఏఐ కంటెంట్ విషయంలో జరిమానాలు, శిక్షలు తప్పవని కేంద్రం స్పష్టం చేసింది. ఏఐ-జనరేటెడ్ కంటేంట్ క్రియేట్, షేర్ చేసే యూజర్లు సమాచారా సాంకేతిక చట్టం, ఇతర చట్టాల ప్రకారం జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుంది.






