Vi: వొడాఫోన్ ఐడియా స్పెక్ట్రమ్ బకాయిని ఈక్విటీగా మార్చేందుకు ప్రభుత్వం ఆమోదం

by S Gopi |

కంపెనీలో ప్రభుత్వం వాటా ఇప్పుడున్న 22.6 శాతం నుంచి 48.9 శాతానికి పెంచుతుంది.

Vi: వొడాఫోన్ ఐడియా స్పెక్ట్రమ్ బకాయిని ఈక్విటీగా మార్చేందుకు ప్రభుత్వం ఆమోదం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా స్పెక్ట్రమ్ వేలం బకాయిలకు బదులుగా రూ. 36,950 కోట్ల విలువైన ఈక్విటీ షేర్‌లుగా మార్చుకునేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియాకు ప్రభుత్వం నిర్ణయం భారీ ఊరటను ఇచ్చినప్పటికీ, కంపెనీలో ప్రభుత్వం వాటా ఇప్పుడున్న 22.6 శాతం నుంచి 48.9 శాతానికి పెంచుతుంది. అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం కంపెనీలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 2021లో ప్యాకేజీని తీసుకొచ్చింది. స్పెక్ట్రమ్‌ వాయిదాలతో పాటు సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిలపై వడ్డీ చెల్లించేందుకు బదులు ఆ మొత్తానికి సమానమైన ఈక్విటీ వాటాను మార్చుకునేందుకు ప్రతిపాదించింది. దీనికి వొడాఫోన్‌ ఇండియా అంగీకరించింది. అందులో భాగంగానే తాజా చర్యలు చేపట్టినట్టు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీకి చెందిన 3,695 కోట్ల ఈక్విటీ షేర్లను రూ. 10 ఫేస్ వాల్యూతో రూ. 10 చొప్పు ఇష్యూ ధరకు బదిలీ చేయాలని నిర్ణయించినట్టు వివరించింది. దీనికి సెబీ, ఇతర సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు వచ్చిన తర్వాత 30 రోజుల్లోగా జారీ చేయనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. కంపెనీలో వాటా గణనీయంగా తగ్గినప్పటికీ ప్రమోటర్లు ఆదిత్య బిర్లా గ్రూప్, వొడాఫోన్ పీఎల్‌సీ కంపెనీల నియంత్రణలోనే కార్యకలాపాలు కొనసాగనున్నాయని వొడాఫోన్ ఐడియా పేర్కొంది.

Next Story