RBI: ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా నియామకం

by S Gopi |

మూడేళ్ల కాలానికి ఆమె నియమకాన్ని కమిటీ ఆమోదించగా, పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం..

RBI: ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా నియామకం
X

దిశ, బిజినెస్ బ్యూరో: మరో ఐదు రోజుల్లో ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తాను నియమిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో ఎండీ పాత్రా వైదొలగడంతో ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ పదవి ఖాళీ అయింది. మూడేళ్ల కాలానికి ఆమె నియమకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించగా, ఆమె పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం పూనమ్ గుప్తా దేశంలోనే అతిపెద్ద ఆర్థిక విధానాల పరిశోధనా సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎన్‌సీఏఈఆర్‌) డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. అలాగే, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యురాలు, 16వ ఆర్థిక సంఘానికి సాహా మండలి కన్వీనర్‌గా కూడా ఉన్నారు. 2021లో ఎన్‌సీఏఈఆర్‌లో చేరడానికి ముందు, ఆమె వాషింగ్టన్, డీసీలోని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్‌లో దాదాపు రెండు దశాబ్దాలు సీనియర్ స్థాయిలో పనిచేశారు. ఆమె ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ (యూఎస్)లో కూడా ప్రొఫెసర్‌గా, ఢిల్లీలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ఐ)లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేశారు. పూనమ్ గుప్తా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్ఐపీఎఫ్‌పీ)లో ఆర్‌బీఐ చైర్ ప్రొఫెసర్‌గా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్)లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్, యూఎస్ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ తీసుకున్నారు. అలాగే ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. 1998లో అంతర్జాతీయ ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ పరిశోధనకు గానూ ఆమెకు ఎగ్జిమ్ బ్యాంక్ బహుమతి లభించింది.

Next Story