Google Store: భారత్‌లో స్వయంగా అమ్మకాలు ప్రారంభించిన గూగుల్

by S Gopi |

సొంత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో పాటు కస్టమర్ల కోసం పిక్సెల్ 8, పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ పరికరాలను అమ్మకానికి ఉంచింది.

Google Store: భారత్‌లో స్వయంగా అమ్మకాలు ప్రారంభించిన గూగుల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ దిగ్గజం గూగుల్ భారత మార్కెట్లో ప్రత్యక్ష అమ్మకాల కోసం మొదటిసారిగా అధికారిక స్టోర్‌ను ప్రారంభించింది. ఇకమీదట గూగుల్ పిక్సెల్, బడ్స్ ప్రో సహా ఇతర గూగుల్ ఉత్పత్తులన్నీ కంపెనీ అధికారిక స్టోర్‌లో లభిస్తాయి. ఇప్పటివరకు ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, టాటాకు చెందిన క్రోమా, రిలయన్స్ డిజిటల్ లాంటి థర్డ్ పార్టీ రిటైలర్లై ఆధారపడింది. అయితే, గత కొన్నేళ్ల నుంచి భారత్‌లో గూగుల్ ఉత్పత్తుల కోసం వినియోగదారుల డిమాండ్ పెరగడం, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో గూగుల్ సొంతంగానే అమ్మకాలను నిర్వహించాలని నిర్ణయించింది. సొంత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో పాటు కస్టమర్ల కోసం పిక్సెల్ 8, పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ పరికరాలను అమ్మకానికి ఉంచింది. స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, పిక్సెల్ వాచ్ 3, బడ్స్ ప్రో 2, ఫోన్ కేసులు, యూఎస్‌బీ-సీ పవర్ అడాప్టర్లు, వాచ్ బ్యాండ్‌లు, మరిన్నింటితో సహా ఇతర ఉత్పత్తులను వెబ్‌సైట్‌లో సేల్‌కు ఉంచింది. ఇప్పటికే భారత్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లకు కీలక మార్కెట్‌గా ఉంది. భవిష్యత్తులో కంపెనీ ఏఐ ఆధారిత ఉత్పత్తులను తీసుకొస్తుందని, భారత్‌లో నేరుగా అమ్మకాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని గూగుల్ ఇండియా డివైజెస్‌ అండ్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ మితుల్ షా అన్నారు. రానున్న రోజుల్లో గూగుల్ ఫిజికల్ స్టోర్లను కూడా తెచ్చే ఆలోచన ఉందన్న ఆయన, ఎప్పటినుంచి అనేది స్పష్టంగా పేర్కొనలేదు.

Next Story