Google: మరోసారి ఉద్యోగులను తొలగించిన గూగుల్

by S Gopi |

నెల రోజుల వ్యవధిలో గూగుల్ రెండోసారి లేఆఫ్స్ నిర్ణయం తీసుకుంది.

Google: మరోసారి ఉద్యోగులను తొలగించిన గూగుల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ రంగంలో జరుగుతున్న పునర్నిర్మాణం, ఏఐ వినియోగంపై కంప్నీలు దృష్టి సారించిన నేపథ్యంలో ప్రముఖ గూగుల్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించింది. గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్‌లోని సేల్స్ అండ్ పార్ట్‌నర్‌షిప్ విభాగాల్లో సుమారు 200 మంది సిబ్బందిని తొలగించింది. దీనికి సంబంధించి వివరాలను ది ఇన్ఫర్మేషన్ మీడియా కథనం పేర్కొంది. ఇతర ప్రధాన టెక్ సంస్థల మాదిరిగానే గూగుల్ కూడా డేటా సెంటర్ మౌలిక సదుపాయాలు, ఏఐ అభివృద్ధి కోసం పనిచేస్తోంది. తక్కువ ప్రభావితమయ్యే విభాగాల్లో పెట్టుబడులను తగ్గించింది. ఇదే సమయంలో కస్టమర్లకు మరింత వేగవంతమైన సేవలు అందించేందుకు ఇలా కొన్ని విభాగాల్లో పెట్టుబడుల తగ్గింపు, ఉద్యోగుల తొలగింపు తప్పదని గూగుల్ అభిప్రాయపడిందని కథనం పేర్కొంది. నెల రోజుల వ్యవధిలో గూగుల్ రెండోసారి లేఆఫ్స్ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలలో జరిగిన తొలగింపుల్లో డివైజ్ యూనిట్, ఆండ్రాయిడ్, క్రోమ్ బ్రౌజర్, పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు సహా వివిధ విభాగాల్లో వందల మందిని తొలగించింది. గూగుల్ గత రెండేళ్ల నుంచి క్రమంగా ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. 2022లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంస్థలోని 20 శాతం మంది ఇప్పటికంటే సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. ఆ తర్వాతి ఏడాదిలోనే ఏకంగా 12 వేల మంది వరకు ఉద్యోగులకు గూగుల్ ఉద్వాసన పలికింది. ఆ తర్వాత గతేడాది డిసెంబర్‌లో కీలకమైన మేనేజర్, డైరెక్టర్లు, వైస్-ప్రెసిడెంట్ హోదాలో ఉన్న వారిలో 10 శాతం మందిని సాగనంపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్ఆర్, క్లౌడ్ వంటి విభాగాల్లో ఖర్చులు తగ్గించుకునే కారణంతో తొలగించింది.

Next Story