Google: ఫ్యూచర్ ఏఐకు సిద్ధంగా లేని ఉద్యోగులు స్వచ్ఛందంగా వెళ్లిపోవచ్చు: గూగుల్

by S Gopi |

భవిష్యత్తు ఏఐ ప్లాన్‌లకు సిద్ధంగా లేని ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీ సౌకర్యం కల్పిస్తున్నట్టు వెల్లడించింది.

Google: ఫ్యూచర్ ఏఐకు సిద్ధంగా లేని ఉద్యోగులు స్వచ్ఛందంగా వెళ్లిపోవచ్చు: గూగుల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: వేగంగా విస్తరిస్తున్న కృత్రిమ మేధ(ఏఐ) కారణంగా కంపెనీలు క్రమంగా ఉద్యోగులను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్ కీలక ప్రకటన చేసింది. కంపెనీ చేపట్టే భవిష్యత్తు ఏఐ ప్లాన్‌లకు సిద్ధంగా లేని ఉద్యోగులు స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకోవాలని ఆఫర్ చేసింది. దీనికోసం వారికి స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీ సౌకర్యం కల్పిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఫిలిప్ షిండ్లర్ ఉద్యోగులకు మెయిల్ ద్వారా తెలియజేశారు. అయితే, ఈ ఆఫర్ ప్రధానంగా కంపెనీకి చెందిన గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్(జీబీఓ) విభాగంలోని కొందరు ఉద్యోగులకు ఈ ప్యాకేజీ వర్తిస్తుందని ఫిలిప్ తన మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ విభాగం కంపెనీ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన యాడ్స్, అంతర్జాతీయ కంపెనీ ఆదాయ, విక్రయాలను చూసుకుంటుంది. ఇటీవల గూగుల్ కంపెనీ 2025 ఏడాదికి సంబంధించి 400 బిలియన్ డాలర్ల మెరుగైన ఆదాయాన్ని వెల్లడించింది. ఈ ఏడాది కూడా కంపెనీ ఆశించిన స్థాయిలోనే ఉంటుందని భావిస్తోంది. అయితే, ఏఐ గతంలో కంటే వేగంగా అందుబాటులోకి వస్తుండటంతో అందుకోసం ఉద్యోగులూ సిద్ధంగా ఉండాలని ఆశిస్తోంది. అయితే, ఈ ఆఫర్ కస్టమర్ ఫేసింగ్ పొజిషన్స్, కస్టమర్ సేల్స్ విభాగంలోని వారికి వర్తించదని స్పష్టం చేసింది. కాగా, గూగుల్ మాత్రమే ఈ తరహా ఆఫర్లను ప్రకటించలేదు. ఇప్పటికే ఇతర టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా లాంటి కంపెనీలు సైతం సీనియర్ ఉద్యోగులకు ఇటువంటి సదుపాయం కల్పించాయి.

Next Story