పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. వడ్డీని నోటిఫై చేసిన కేంద్రం

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-18 08:54:47  IST  )

దేశంలో కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రప్రభుత్వం శుభవార్త అందించింది.

పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. వడ్డీని నోటిఫై చేసిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రప్రభుత్వం శుభవార్త అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను.. ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీరేటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఈ నెలలోనే చందాదారుల ఖాతాల్లో పీఎఫ్ వడ్డీ డబ్బులు జమకానున్నట్లు PTI నివేదిక పేర్కొంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సిఫార్సు చేసిన వడ్డీరేటుకు ఆర్థిక మంత్రిత్వశాఖ తుది ఆమోదం తెలపడంతో ఈ ప్రక్రియ ఖరారయింది. కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ ఏడాది మార్చి 2వ తేదీన జరిగిన సీబీటీ మీటింగ్ లోనే పీఎఫ్ సొమ్ముకు 8.25 వడ్డీరేటుకు ప్రాథమిక ఆమోదం లభించింది.

అయితే.. పీఎఫ్ డిపాజిట్లకు భారత ప్రభుత్వమే బాధ్యత వహిస్తోంది. ఈ క్రమంలో వడ్డీరేట్ల మంజూరుకు ఆర్థిక మంత్రిత్వశాఖ అనుమతి తప్పనిసరి అయింది. తాజాగా ఆశాఖ నుంచి అనుమతి రాగా.. ఈ నెలలోనే పీఎఫ్ ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీని జమ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ కానున్నాయి. కొత్త డిజిటల్ వ్యవస్థను ఉపయోగించి.. ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఈపీఎఫ్ఓ భావిస్తోంది. ఫలితంగా పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులు వెంటనే జమ అవుతాయి. కాగా.. వరుసగా మూడో ఏడాది వడ్డీరేటులో ఎలాంటి మార్పు లేదు. 2022-23లో 8.15 శాతంలో ఉన్న వడ్డీరేటు.. 2023-24లో 8.25కి పెంచారు. అప్పటి నుంచీ ఇదే వడ్డీరేటు కొనసాగుతోంది. 1977-78లో 8 శాతం ఉన్న వడ్డీ.. ఆ తర్వాత మారుతూ వచ్చింది. అత్యధికంగా 2015-16లో 8.8 శాతం 2018-19 8.65 శాతం వడ్డీ అందించారు.

Next Story