- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold: ఒక్కరోజే రూ. 3,400 తగ్గిన బంగారం
దేశ రాజధానిలో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు ఏకంగా రూ. 3,400 తగ్గి రూ. 96,550కి చేరుకుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు భారీ దిగి వచ్చాయి. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా సోమవారం నాటి పరిణామాలు పసిడి ధరలను కిందకు లాగాయి. ప్రధానంగా అమెరికా, చైనా మధ్య నెలకొన్ని వాణిజ్య సుంకాల తగువుకు 90 రోజుల పాటు విరామం ప్రకటించడం, ఇరు దేశాలు పరస్పరం 115 శాతం మేర టారిఫ్‌లను తగ్గించేందుకు అవగాహన ఏర్పరచుకోవడం, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఈ వారంలో చర్చలు శాంతి చర్చలపై సానుకూల సంకేతాలు బంగారం ధరలపై ప్రభావం చూపాయి. దీనికి తోడు దేశీయంగా అత్యంత కీలకమైన భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణతో పసిడిలో పెట్టుబడి పెట్టిన వారంతా లాభాలను తీసుకునేందుకు సిద్ధపడటం ధరలు క్షీణించేందుకు దోహదపడ్డాయి. ఫలితంగా దేశ రాజధానిలో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు ఏకంగా రూ. 3,400 తగ్గి రూ. 96,550కి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 2024, జూలై 23 తర్వాత బంగారం ధరలు ఒక్కరోజులోనే ఈ స్థాయి పతనం కావడం తొలిసారి. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 99,950 ఉండగా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి ధర రూ. 99,500 ఉంది. ఇక, హైదరాబాద్ మార్కెట్లో సోమవారం సాయంత్రానికి స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 1,800 పడిపోయి రూ. 96,880 ఉండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం రూ. 1,650 తగ్గి రూ. 87,500కి చేరింది. వెండి ధరలు స్వల్పంగా తగ్గి రూ. 99,700 వద్ద ఉన్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలు సానుకూలంగా మారడం, భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో బంగారం ధరలు పడిపోయాయని ఈక్విటీస్‌కు చెందిన కమొడిటీస్ వైస్-ప్రెసిడెంట్ రాహుల్ కలాంత్రి పేర్కొన్నారు.






