Gold: యుద్ధ ప్రభావంతో మరోసారి పసిడి ధరలకు రెక్కలు

by S Gopi |

ఈ క్రమంలో సోమవారం భారత మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ. 6,000 పెరిగింది

Gold: యుద్ధ ప్రభావంతో మరోసారి పసిడి ధరలకు రెక్కలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు అంతకంతకు ముదురుతుండటంతో భారత్‌తో పాటు అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు మరోసారి కొత్త గరిష్ఠాలకు చేరుతున్నాయి. ఇటీవల కొంత స్థిరంగా సాగిన వీటి ధరలు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టడం, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించడం పరిణామాల మధ్య సురక్షిత సాధనాల్లోకి ఇన్వెస్టర్లు నిధులు తరలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం భారత మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 10 గ్రాములకు దాదాపు రూ. 6,000 పెరిగింది, వెండి కూడా కిలో రూ. 20,500 వరకు పెరిగింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్‌లతో ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుండటం, ఇది ప్రపంచ మార్కెట్లలో భయం, అనిశ్చితిని సృష్టించింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్‌ మరణం ఉద్రిక్తతలను మరింత పెంచింది. తర్వాత ఏం జరుగుతుందోననే ఆందోళనలు పెట్టుబడిదారుల్లో పెరిగిందని పలు నివేదికలు చెబుతున్నాయి. అనిశ్చితి పెరిగినప్పుడు, ప్రజలు తరచుగా తమ డబ్బును కాపాడుకోవడానికి బంగారం, వెండి లాంటి సురక్షిత సాధనాల్లోకి తరలిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బంగారం, వెండి ధరలు ఇంకా పెరగవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర రూ. 1,70,630కి చేరగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి పది గ్రాములు రూ. 1,56,300 వద్ద ఉంది. వెండి రూ. 20 వేలు పెరగడంతో కిలో రూ. 3.15 లక్షలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ పసిడి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం సాయంత్రం తర్వాత ఔన్స్ స్పాట్ గోల్డ్ 5,395 డాలర్ల వద్ద ఉండగా, వెండి ఔన్స్ 87 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.

Next Story