Imports: ఆల్‌టైమ్ గరిష్ఠానికి బంగారం, వెండి దిగుమతుల బిల్లు

by S Gopi |   (  Updated:2026-02-11 12:35:54  IST  )

ఈ రెండు విలువైన లోహాల ధరలు రికార్డు స్థాయిలో పెరగడమే ఈ స్థాయి దిగుమతి బిల్లులకు కారణం. 2025లో బంగారం ధర దాదాపు 76 శాతం పెరగ్గా, వెండి ధర మూడు రెట్లు పెరిగింది.

Imports: ఆల్‌టైమ్ గరిష్ఠానికి బంగారం, వెండి దిగుమతుల బిల్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2025 క్యాలెండర్ ఏడాదిలో బంగారం, వెండి దిగుమతుల బిల్లు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరాయి. బంగారం దిగుమతుల బిల్లు 58.8 బిలియన్ డాలర్ల(రూ. 5.39 లక్షల కోట్ల)కు చేరుకోగా, వెండి దిగుమతుల బిల్లు 9.2 బిలియన్ డాలర్ల(రూ. 84.4 వేల కోట్ల)కు చేరాయి. వెండి విషయంలో ఈ పెరుగుదల అసాధారణంగా ఉంది. ఇవి రెండూ కలిపి దేశ మొత్తం 750 బిలియన్ డాలర్ల దిగుమతి బిల్లులో 9 శాతం వాటా ఉన్నాయి. ఈ రెండు విలువైన లోహాల ధరలు రికార్డు స్థాయిలో పెరగడమే ఈ స్థాయి దిగుమతి బిల్లులకు కారణం. 2025లో బంగారం ధర దాదాపు 76 శాతం పెరగ్గా, వెండి ధర మూడు రెట్లు పెరిగింది. పరిమాణం పరంగా ఈ రెండు లోహాల దిగుమతులను పరిగణనలోకి తీసుకుంటే, అంత ఎక్కువేమీ పెరగలేదు.

2025లో బంగారం దిగుమతులు సుమారు 630 టన్నులు దిగుమతి కాగా, ఇది గతేడాది కంటే 27 శాతం తగ్గింది. లండన్ కేంద్రంగా పనిచేసే బులియన్ పరిశోధన సంస్థ మెటల్ ఫోకస్ డేటా ప్రకారం, వెండి దిగుమతులు 7,158 టన్నులుగా నమోదయ్యాయి, ఇది గత సంవత్సరం కంటే 6.5 శాతం తక్కువ. బంగారం, వెండి దిగుమతుల బిల్లును ధరల కోణం నుంచి చూడాలి. ధరలు భారీగా పెరగడం వల్ల వీటి దిగుమతులు పెరుగుతున్నాయి. అయితే, ఈసారి భారత దిగుమతి బిల్లును వెండి ఎక్కువ ప్రభావితం చేసింది. ఒక్క 2025లోనే వెండి 200 శాతానికి పైగా పెరిగిందని మెటల్ ఫోకస్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ చిరాగ్ షేత్ అన్నారు. అయితే, మొత్తం దిగుమతుల్లో ఈ రెండు లోహాల వాటా 2024 నాటి 9 శాతం వద్దే ఉన్నాయి. దిగుమతులతో పాటు, 2025లో బంగారం డిమాండ్ కూడా 15-20 శాతం తగ్గిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

Next Story