Gold Rate: జీవితకాల గరిష్ఠాలకు చేరిన బంగారం

by S Gopi |

దేశీయంగా కూడా గురువారం ధరలు రూ.3,600 పెరిగి రికార్డు స్థాయిలో రూ.1,02,620కి చేరుకున్నాయి.

Gold Rate: జీవితకాల గరిష్ఠాలకు చేరిన బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మరోసారి బంగారం ధరలు రికార్డు గరిష్ఠాలను చేరాయి. అమెరికా ప్రభుత్వం భారత దిగుమతులపై 25 శాతం అదనపు సుంకాన్ని ప్రకటించిన తర్వాత పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులపై ఆసక్తి చూపడంతో అంతర్జాతీయంగా పసిడికి గిరాకీ ఊపందుకుంది. ఈ క్రమంలోనే దేశీయంగా కూడా గురువారం ధరలు రూ.3,600 పెరిగి రికార్డు స్థాయిలో రూ.1,02,620కి చేరుకున్నాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి పది గ్రాములు రూ. 1,02,620(అన్ని పన్నులు కలిపి) జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లోనూ దాదాపు ఇంతే ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం రూ. 94,000కు చేరుకుంది. వెండి ధరలు సైతం కిలో రూ. 1,500 పెరిగి రూ. 1,14,000కి చేరుకున్నాయి(అన్ని పన్నులు కలిపి). దీనికి ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలే కారణమని పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా భారత్‌పై అమెరికా అదనపు సుంకాన్ని ప్రకటించడంతో రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత ముదిరాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ అన్నారు. చిప్ దిగుమతులపైనా 100 శాతం సుంకాలు ఉంటాయని ట్రంప్ బెదిరించడంతో బంగారానికి గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. వీటికి తోడు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోత, డాలర్ విలువ క్షీణత వంటి అంశాలు కూడా దోహదపడ్డాయి. ఫలితంగా గ్లోబల్ మార్కెట్లలో ఔన్స్ బంగారం 3,379.15 డాలర్లకు చేరుకుంది.

Next Story