Gold Rate: రాకెట్‌లా దూసుకెళ్తున్న బంగారం.. 90 వేలకు చేరువైన పసిడి!

by Yella Dhawani Reddy |

పండుగలు, పెళ్లిళ్లు.. ఇలా శుభకార్యాలు ఏవైనా ముందుగా గుర్తొచ్చేది బంగారం. ముఖ్యంగా భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం.

Gold Rate: రాకెట్‌లా దూసుకెళ్తున్న బంగారం.. 90 వేలకు చేరువైన పసిడి!
X

దిశ, వెబ్ డెస్క్: పండుగలు, పెళ్లిళ్లు.. ఇలా శుభకార్యాలు ఏవైనా ముందుగా గుర్తొచ్చేది బంగారం. ముఖ్యంగా భారతీయ మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఇక బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాదు.. పెట్టుబడి సాధనంగా కూడా భావిస్తారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి కారణంగా.. దేశీయంగా పసిడి ధరలు పైపైకి దూసుకెళ్తున్నాయి. 2025లో బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు (All time record) చేరుకుంటాయని మార్కెట్ల విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే రాకెట్‌లా దూసుకెళ్తున్నాయి. ఇవాళ (ఫిబ్రవరి 4) ఒక్కరోజే ఏకంగా తులం బంగారంపై రూ.1150 పెరిగి.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold rate) రూ.85,200కు చేరింది. దీంతో త్వరలోనే తులం బంగారం ధర రూ.90 వేలకు చేరే అవకాశాలు కనిపిస్తోన్నాయి.

పెరుగుదలకు కారణాలు..

అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donalrd Trump) తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయంగా బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కెనడా, మెక్సికో, చైనా ఉత్పత్తులపై భారీగా టారిఫ్‌లు ప్రకటించిన ట్రంప్.. తదుపరి మెక్సికోకు మాత్రం విరామం కల్పించారు. ఈ క్రమంలో అమెరికా వస్తువులపై పన్ను విధిస్తామని కెనడా, చైనా ప్రకటించిన నేపథ్యంలో సోమవారం అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. ఈ నేపథ్యంలో మదుపర్లు తమ పెట్టుబడులను సురక్షితంగా ఉండేందుకు బంగారం వైపు మళ్లించటంతో పుత్తడి ధర కొండెక్కింది. మున్ముందూ పరిస్థితులు ఇలాగే కొనసాగితే బంగారం ధరలు కొత్త రికార్డుల్నే సృష్టించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావటంతో దేశీయంగా బంగారం కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ గోల్డ్‌ 2,827.50 డాలర్లుగా నమోదైంది. క్రితంతో పోల్చితే 7.50 డాలర్లు పెరిగింది. ఔన్స్‌ సిల్వర్‌ 32.10 డాలర్లు పలికింది.

బంగారంతో పాటు వెండి కూడా ఈ ఏడాది ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,25,000 వరకు వెళ్లొచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,06,000 వద్ద కొనసాగుతోంది. ఇక 2024లో రూ.1,02,000 ల ధరతో దేశీయంగా సిల్వర్‌ ఆల్‌టైమ్‌ హై రికార్డుకు చేరిన సంగతి తెలిసిందే.

Next Story