Gold Rate: చిరుతను మించిన వేగం.. లక్షకు రెండు అడుగుల దూరంలో తులం బంగారం ధర

by Vennela |

Gold Rate: బంగారం దూకుడు మీదుంది. అందనంత ఎత్తుకు చేరుకుంటోంది.

Gold Rate: చిరుతను మించిన వేగం.. లక్షకు రెండు అడుగుల దూరంలో తులం బంగారం ధర
X

దిశ, వెబ్ డెస్క్: Gold Rate: బంగారం దూకుడు మీదుంది. అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. బుధవారం నాడు ఆల్ టైం గరిష్టాన్ని నమోదు చేసింది. ఇప్పుడు లక్షకు రెండు అడుగుల దూరంలో ఉంది. అమెరికా, చైనాల మధ్య ముదురుతున్న సుంకాల యుద్ధం, అంతర్జాతీయ షేర్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు డాలర్ ఇండెక్స్ పడిపోవడం..ఇలాంటి కారణాలతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురుక్షితమైన పెట్టుబడిగా భావిస్తుండటంతో బంగారం ధర రోజురోజుకు చుక్కలను తాకుతోంది.

బుధవారం దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24క్యారెట్ల ధర ఏకంగా రూ. 1650 పెరిగింది. దీంతో 98,100గా నమోదు అయ్యింది. హైదరాబాద్ లో కాస్త తక్కువగా రూ. 97,700 పలికింది. బంగారంతోపాటు వెండి కూడా పరుగులు పెడుతోంది. ఒక్కరోజులో రూ. 1900 పెరిగింది. కిలో వెండి ధర రూ. 99,400 అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 3,318 గరిష్టాన్ని తాకింది. ఈ జోరు చూస్తే బంగారం కంటే ముందే వెండి ధర లక్ష మార్కు దాటడం ఖాయమనిపిస్తోంది.

ఇక అమెరికా, చైనాల మధ్య ఇంకా టారిఫ్ వార్ ఘర్షణ ముదిరేలా కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్లో భారీ క్షీణత, డాలర్ ఇండెక్స్ సన్నగిల్లుతుండటం అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీరేట్లు తగ్గించవచ్చన్న సంకేతాలతో బంగారం ధర ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. పరిస్థితులు ఈ విధంగానే కొనసాగితే నేడో, రేపో బంగారం లక్ష రూపాయలు దాటడం ఖాయమే అనిపిస్తోంది. ఈ సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనుక్కోవాలనుకుంటున్న సామాన్యులకు బంగారం అందనంత ధరలో ఉంటూ ఆందోళన కలిగిస్తోంది.

డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థిక మాంద్యం వైపు వెళ్తుందా అని చాలా మంది భావిస్తున్నారు. జూన్ నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ల వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. సెంట్రల్ బ్యాంకు కూడా బంగారం పెద్దెత్తున కొనుగోలు చేస్తున్నాయి. ఇది కూడా బంగారం ధర పెరిగేందుకు ఒక కారణమని చెప్పవచ్చు.

Next Story