Gold: ఐదు వారాల గరిష్టానికి చేరిన బంగారం ధరలు

by S Gopi |

ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు డాలర్ విలువ కలిగిన బంగారం మరింత సరసమైనదిగా మారింది

Gold: ఐదు వారాల గరిష్టానికి చేరిన బంగారం ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయిలకు చేరాయి. డాలర్‌తో పాటు యూఎస్ బాండ్ల దిగుబడి బలహీనంగా మారడంతో మంగళవారం పసిడి ధరలు వరుసగా ఐదవ రోజు పెరిగాయి. దీంతో ధరలు ఐదు వారాల గరిష్ఠానికి చేరుకున్నాయి. అంతేకాకుండా ఆగష్టు 1న అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు, మరిన్ని సుంకాలకు సంబంధించి చర్చలు అంతర్జాతీయ మార్కెట్లలోనూ ధరలు పెరిగేందుకు దోహదపడ్డాయి. తాజాగా యుఎస్ డాలర్ ఇండెక్స్ 0.6 శాతం క్షీణించింది. ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు డాలర్ విలువ కలిగిన బంగారం మరింత సరసమైనదిగా మారింది, అయితే బెంచ్‌మార్క్ 10 ఏళ్ల యూఎస్ ట్రెజరీ బాండ్లు వారం కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు ఊహించిన దానికంటే ముందుగానే యూఎస్ ఫెడ్ రేట్ల కోత గురించి సంకేతాలిస్తోంది. ఈ పరిణామాలు మార్కెట్ గందరగోళానికి కారణమవుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశీయంగా గ్లోబల్ పరిణామాలతో పాటు మనదేశంలోని వ్యాపారులు డిమాండ్ ఆధారంగా బలమైన కొనుగోళ్లకు సిద్ధపడటంతో మంగళవారం స్వచ్ఛమైన బంగారం మరోసారి రూ. లక్ష దాటింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి రూ. 1,140 పెరిగి రూ. 1,01,290 వద్ద ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 1,050 పెరిగి రూ. 92,850కి చేరింది. 18 క్యారెట్ల పసిడి ధర రూ. 860 పెరిగి రూ. 75,970 వద్ద ఉంది. గ్లోబల్ మార్కెట్లలోనూ ఔన్స్ బంగారం 3,394.23 డాలర్లకు చేరింది.

Next Story