భగ్గుమన్న బంగారం.. హైదరాబాద్‌లో ఆల్‌‌టైమ్ హైకి చేరిన గోల్డ్ రేట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-09-16 08:32:36  IST  )

బంగారం ధరలు (Gold Rates) తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్న వారి ఆశలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి.

భగ్గుమన్న బంగారం.. హైదరాబాద్‌లో ఆల్‌‌టైమ్ హైకి చేరిన గోల్డ్ రేట్
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం ధరలు (Gold Rates) తగ్గుతాయని ఆశగా ఎదురుచూస్తున్న వారి ఆశలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. ఇక ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి, కట్నకానుకల్లో బంగారం పెట్టేవారికి.. పసిడి గుదిబండగా మారనుంది. తాజాగా 10 గ్రాముల బంగారం ధర ఆల్ టైమ్ హై కి చేరుకుంది. అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ పాలసీ వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాలు పెరగడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,15,000కు చేరువైంది. ప్రస్తుతం నగరంలో 10 గ్రాముల బంగారం ధర కమొడిటీల్లో 1,10,418కి చేరింది. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,13,920కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్సు బంగారం ధర 3,700 డాలర్లకు పెరిగింది. మరోవైపు డాలర్ తో పోలిస్తే భారత్ రూపాయి విలువ రోజురోజుకూ పతనమవుతోంది. ఈ క్రమంలో అమెరికా వడ్డీరేట్లు తగ్గిస్తే.. డాలర్ విలువ కాస్త పతనమై బంగారం ధర ఇంకా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. కాగా.. బంగారం ధర మున్ముందు పెరుగుతుందే తప్ప తగ్గదని వ్యాపారులు భావిస్తున్నారు. 2028 నాటికి ఒక గ్రాము బంగారం ధర రూ.20 వేలకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు. బంగారం ధర రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో గోల్డ్ స్కీమ్లకు డిమాండ్ పెరిగింది.

వడ్డీరేట్లు తగ్గితే బంగారం ధర ఎందుకు పెరుగుతుంది?

అమెరికాలో వడ్డీరేట్లు తగ్గితే.. డాలర్ విలువ బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర డాలర్లలో నిర్ణయిస్తారు కాబట్టి.. డాలర్ విలువ తగ్గితే మన దగ్గర బంగారం ధర పెరుగుతుంది. పైగా వడ్డీరేట్లు తక్కువగా ఉంటే.. బ్యాంకు డిపాజిట్లు, బాండ్లు వంటి స్థిర ఆదాయ పెట్టుబడులపై రాబడి తగ్గుతుంది. దాంతో పెట్టుబడి దారులు బంగారం వంటి ఇతర ఆస్తులవైపు మొగ్గుచూపుతారు. ఫలితంగా డిమాండ్ పెరిగి.. ధర కూడా ఆకాశాన్నంటుతుందని నిపుణులు చెప్తున్నారు.

Next Story