తగ్గేదే లే.. వరుసగా ఆరో రోజు పెరిగిన బంగారం ధర

by Naga Rani Yarlagadda |

బంగారం , వెండి ధరలు రోజురోజుకూ ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి.

తగ్గేదే లే.. వరుసగా ఆరో రోజు పెరిగిన బంగారం ధర
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం , వెండి ధరలు రోజురోజుకూ ఆకాశమే హద్దుగా పెరుగుతున్నాయి. కాస్తైనా ధర తగ్గితే కొందామని ఆశగా ఎదురుచూస్తున్న సామాన్యులకు బంగారం.. అందని ద్రాక్షగా మారుతోంది. పండుగ సీజన్ కావడంతో కొనుగోళ్లకు డిమాండ్ పెరిగినా.. అది గొప్పోళ్ల ఇంటి సంపదే అవుతోంది. ఇక పెళ్లి ముహూర్తాలు దగ్గరపడుతుండటంతో చేసేది లేక కావలసిన మేరకు బంగారం కొనక తప్పట్లేదని కొందరు వాపోతున్నారు. వరుసగా ఆరో రోజు బంగారం ధర పెరిగింది.

బుధవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.1200 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1100 మేర పెరిగింది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1,17,440కి చేరగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,650కి పెరిగింది. అంటే ఒక్క గ్రాము బంగారం పై ధర రూ.110 నుంచి రూ.120కి పెరిగింది.

బంగారం ధర పెరిగినా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండిపై రూ.1000 తగ్గడంతో.. రూ.1,60,000కు చేరింది. గడిచిన 10 రోజులుగా పైపైకి ఎగబాకిన వెండి నేడు స్వల్పంగా తగ్గడంతో కొనుగోలు దారులకు కాస్త ఊరట లభించినట్లైంది. కానీ.. సెప్టెంబర్ 1న కిలో వెండి ధర రూ.1,36,000 ఉండగా.. సెప్టెంబర్ 30కి ఈ ధర రూ.1,61,000కు చేరింది. నెలరోజుల్లోనే కిలో వెండి ధర రూ.25 వేలు పెరిగింది. మున్ముందు బంగారం, వెండి ధరలు మరింత ప్రియమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story