Gold: 2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం

by S Gopi |

వడ్డీ రేట్ల విషయంలో సెంట్రల్ బ్యాంకులు తీసుకున్న చర్యల కారణంగా ధరలు దాదాపు 53 శాతం పెరిగాయి.

Gold: 2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇప్పటికే రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్న బంగారం ధరలు మరింత పెరగనున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. 2026లో పసిడి ధరలు ప్రస్తుత స్థాయిల నుంచి 15-30 శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్(డబ్ల్యూజీసీ) అభిప్రాయపడింది. ఈ ఏడాదిలో అమెరికా అనుసరించిన అధిక సుంకాలు, భొహోళిక రాజకీయ ఆందోళన మధ్య పెట్టుబడిదారులు పసిడిని భద్రత కోసం కొనుగోలు చేశారు. వీటికి తోడు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ)తో పాటు వివిధ సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోళ్లను కొనసాగించాయి. అంతేకాకుండా వడ్డీ రేట్ల విషయంలో సెంట్రల్ బ్యాంకులు తీసుకున్న చర్యల కారణంగా ధరలు దాదాపు 53 శాతం పెరిగాయి. ముఖ్యంగా గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్) ద్వారా ఎక్కువ పెట్టుబడులు రావడంతో పసిడి డిమాండ్‌కు కీలక డ్రైవర్‌గా ఉంటోందని, ఆభరణాల మార్కెట్లతో పాటు ఇతర విభాగాల్లో తగ్గిన అమ్మకాలను ఇది భర్తీ చేస్తున్నదని డబ్ల్యూజీసీ వివరించింది. డబ్ల్యూజీసీ డేటా ప్రకారం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు గ్లోబల్ గోల్డ్ ఈటీఎఫ్‌లు 77 బిలియన్ డాలర్ల(రూ. 6.92 లక్షల కోట్ల) నిధులను చూశాయి. దీనితో వాటి హోల్డింగ్‌లకు 700 టన్నులకు పైగా యాడ్ అయింది.

అయితే, పరిస్థితులు ప్రతికూలంగా మారితే 2026లో బంగారం ధరలు 5-20 శాతం పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని డబ్ల్యూజీసీ అభిప్రాయపడింది. అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు పూర్తిగా అమలైతే పసిడి ధరల క్షీణత ఏర్పడవచ్చు. ఇది గనక జరిగితే అమెరికా వృద్ధి గణనీయంగా మెరుగుపడొచ్చు. అప్పుడు ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండటమే కాకుండా కార్యకలాపాలు పెరుగుతాయి, ప్రపంచ వృద్ధి పుంజుకుంటుందని డబ్ల్యూజీసీ నివేదిక పేర్కొంది.

Next Story