Gold: తొలిసారి రూ. 1.06 లక్షలకు చేరిన బంగారం ధరలు

by S Gopi |   (  Updated:2025-09-02 23:32:45  IST  )

హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాములు రూ. 1,06,170 (అన్ని పన్నులు కలిపి) జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది.

Gold: తొలిసారి రూ. 1.06 లక్షలకు చేరిన బంగారం ధరలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు అందనంత ఎత్తుకు దూసుకెళ్తున్నాయి. ఈ వారంలోనే తొలిసారి పసిడి ధరలు రూ. 1,05,000 మార్కును దాటాయి. తాజాగా మంగళవారం మరోసారి సరికొత్త ఆల్‌టైమ్ హై స్థాయిలకు చేరాయి. ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ. 1,06,240 వద్ద ఉంది. హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాములు రూ. 1,06,170 (అన్ని పన్నులు కలిపి) జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పసిడి రూ. 97,050 వద్దకు చేరింది. వెండి ధరలు కిలోకు రూ. 1,36,100 వద్ద ఉంది. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, భారత కరెన్సీ రూపాయి బలహీనపడటంతో బంగారం ధరలు కొత్త గరిష్ఠాలకు చేరాయి. ఇదే సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధ అవకాశాలు పెరగడంతో పాటు, చైనా లాంటి పలు సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం ధరల పెరుగుదలను ప్రభావితం చేశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లో రేట్ల తగ్గింపు ఉండొచ్చని సంకేతాలిచ్చింది. దీంతో బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. 25 బేసిస్ పాయింట్ల కోతకు 86 శాతం అవకాశం ఉందని అంచనాలు రావడంతో పసిడి ధరలు వేగంగా పెరిగాయి. ప్రస్తుత పరిణామాల మధ్య బంగారం రూ. 1,06,400 నుంచి రూ. 1,08,000 మధ్య స్థిరంగా కొనసాగవచ్చని నిపుణులు అంచనా.

Next Story